
బెనోని: టీం ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఏదైనా.. ఎక్కడైనా అస్సలు తగ్గేదేలే అన్నట్లు విజృంభిస్తున్నాడు. 14 ఏళ్ల వయస్సులోనే ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో యూత్ వన్డేలోనూ వైభవ్ తన విశ్వరూపం చూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 245 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సఫారీల బ్యాటింగ్‌లో జేసన్ రోలెస్(114) సెంచరీతో చెలరేగిపోయాడు.
అయితే 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వైభవ్, ఆరోన్ జార్జ్‌లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 67 పరుగులు జోడించారు. అయితే 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జార్జ్ ఔట్ అయ్యాడు. కానీ వైభవ్ మాత్రం బౌలర్లను ఉతికేశాడు. 19 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్న ఈ చిచ్చరపిడుగు.. 24 బంతుల్లో 1 ఫోరు, 10 సిక్సులతో 68 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం వర్షం కారణంగా మ్యాచ్‌ను 42 ఓవర్లకు, టార్గెట్‌ను 213కు కుదించారు. ప్రస్తుతం భారత్ 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. ఇంకా 116 పరుగులు చేయాల్సి ఉంది.