
పక్కటెముకల మధ్యలో పెను కెరటాలు
పాల సముద్రానివో కలుషిత కాసారానివో
శిరస్సు బావిలోనుంచి కప్పల అరుపులు
అవి ఆకలి కేకలో కోసుకుపోయే కోరికలో
ఎప్పుడూ ఏదో పండుగ చేసుకోవాలనుంటుంది
పండుగ కోసం ఏదైనా గెల్చుకురావాల్సుంటుంది
బుట్టలోని ముగ్గుపిండి బాగా ఎండిపోయింది
చిన్న చిన్న గాలి తరగలకే చెదరి పోతున్నది
విడిపోయిన కణాలు తిరిగి కల్సుకోడానికి
చేస్తున్న విఫల యత్నం విశ్వ సంగీతం?
మనిషికి ఏం చెప్పాలో అదే చెప్పి ఒప్పించడానికి
ఇపుడిపుడే కొన్ని వాక్యాలు తయారవుతున్నాయి
తయారయిన వాక్యాల్ని కలిపి కావ్యాలు చేయాలి
కావ్యాల్ని కావ్య నాయకులకిచ్చి చేతులు చాచి
‘లేదు సత్యం మహర్షీ లే దసత్యమ’ని పిచ్చిగా అరుస్తూ
మళ్లీ అడివికే వెళ్ళిపోవాలి. వెళ్తూవెళ్తూ ఇక్కడి జనాల,
మొహాల మీద పుక్కిటి పురాణాలుగా పేరుకు పోయిన
ప్రాచీన విషాదాల్ని, బహుశా, నాతోనే తీసుకుని వెళ్లాలి
వాక్యాలు కావ్యాలయినా కాకున్నా; అవి ఒక ప్రపంచంగా,
ఒక దేశంగా, కనీసం ప్రదేశంగా కలవకపోవడం విషాదం
ఏం చేస్తాను?
తరతరాల ఆటవిక ఆధునికతను ముఖానికి పూసుకుని
ఏడుపు బువ్వను నవ్వుల తగరంలో పార్సిల్ చేసుకుని
గాయపడిన ఆవేశాల
ఎముకల దండ మెడలో వేసుకుని
బిచ్చమెత్తుకుంటూ
తిరుగుతాను
కాసింత రసజ్ఞత కోసం
లేదా ఇచ్చోటనే పడి యుండెదనీ, నిర్గమన ద్వారం లేని
కురుక్షేత్రంలో రాత్రి కంచెకు వేలాడే అమృతకళేబరమై
-హెచ్చార్కె