Reading Time: 2 minutes

 కొద్దినెలలుగా మదురో కదలికలపై అమెరికా నిఘా, రిహార్సల్స్

రోజువారీ దినచర్యపై ఆరా

రాజధాని కారకస్‌లో తొలుత విద్యుత్ నిలిపివేత

విజయవంతంగా ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్

న్యూయార్క్ ః నూతన సంవత్సర శుభాకాంక్షలు..అని అమెరికా సేనల చేతుల్లో బందీ అయిన మరుక్షణమే వెనెజువెలా అధ్యక్షులు నికోలాస్ మదురో స్పందించారు. కరాకస్‌లోని ఆయన నివాసం నుంచి భార్య సిలియా ఫ్లోరెస్‌తో పాటు అర్థరాత్రివేళ బెడ్‌రూం నుంచి అమెరికా సేనలు ఆయనను పట్టుకువెళ్లాయి. తరువాత చేతులకు సంకెళ్లు వేసి, అమెరికా యుద్ధనౌకలో దంపతులిద్దరిని న్యూయార్క్‌కు తరలించారు. అమెరికా మాదకద్రవ్యాల నిరోధక చట్టం నిబంధనల మేరకే ఆయనను నిర్బంధం లోకి తీసుకున్నారు. ఆయనను బందీ చేసిఅమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార యంత్రాంగం ౯డిఇఎ) అధికారులు న్యూయార్క్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయంలోకి తీసుకువెళ్లారు.

సంబంధిత వీడియో ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తాయి. మదురో తన భార్యతో కలిసి కరాకస్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఫోర్టు టియూనా సైనిక స్థావర కంపౌండ్‌లోని నివాసంలో ఉన్నప్పుడే మెరుపుదాడి జరిగింది. అమెరికా చట్టసభలకు, కాంగ్రెస్‌కు ముందస్తు సమాచారం వంటిది ఏమీ లేకుండానే ట్రంప్ తమ విశేషాధికారాలను వినియోగించుకుని ఈ చర్యకు దిగారు. వైట్‌హౌస్ అధికారిక మెరుపు వేగ సైనిక చర్యల దళం రాపిడ్ రెస్పాన్స్ 47 ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించారు. తనను బందీ చేసిన వెంటనే మదురో హ్యాపి న్యూ ఇయర్‌తో వారిని పలకరించినట్లు వెల్లడైంది.

అంచనాలకు అందని రీతిలో నిర్బంధం

అమెరికాలో భారీ స్థాయిలో డ్రగ్స్ మాఫియాలను వెనెజువెలా నేత మదురో నిర్వహిస్తున్నారనేదే ఇప్పటి ఆయన నిర్బందానికి దారితీసింది. పైగా అత్యంత సుసంపన్న చమురు నిల్వలు, ఇతరదేశాలతో కొంత మేరకు వెలివేసినట్లుగా ఉండే సంబంధాలు అన్నింటిని అమెరికా బేరీజు వేసుకుంది. మదురో దంపతులను ట్రంప్ సారధ్యపు సేనలు ఉన్నట్లుండి అదుపులోకి తీసుకోలేదు. నెలల తరబడి పన్నిన వ్యూహాల ఫలితంగానే పట్టుకుని తీసుకువెళ్లారని, ఇది చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ జరగని ఘటన అని విశ్లేషణలు వెలువడ్డాయి. చాలా రోజులుగా వెనెజువెలా తీరం వెంబడి అమెరికా సేనలు , ప్రత్యేకించి యుద్ధ నౌకలు మొహరించుకుని ఉంటూ వచ్చాయి. పలు దఫాలు గణనీయ రీతిలో అక్రమ మాదక ద్రవ్యాల ముఠాల నాటు పడవలను పేల్చివేయడం, ఇందులోని వారిని చంపివేయడం జరుగుతూ వచ్చింది. సంబంధిత చర్యలను అమెరికా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంది.

మదురో కదలికలపై అనుక్షణ నిఘా

అమెరికా ఇంటలిజెన్స్ సంస్థలు అత్యంత చాకచక్యంగా కొద్ది నెలలుగా మదురో వ్యక్తిగత భద్రత, ఆయన కదలికల గురించి ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉంచాయి. ఆయన ఎప్పుడు పడుకుంటాడు? ఆహార అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి? రోజువారి దినచర్యను పసికడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే యుఎస్ ప్రత్యేక బలగాలు రహస్యంగా తమ ఆపరేషన్ కోసం రిహార్సల్‌కు కూడా దిగుతూ వచ్చాయ. ముందుగా రాజధాని కరాకస్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా చేశారు. దట్టమైన చీకట్ల నడుమ మదురో నివాసంలోకి దూసుకువెళ్లారు. దుర్భేధ్యపు కట్టడంలోనికి విదేశీ సైనిక బలగాలు ఏ విధంగా దూసుకువెళ్లగలిగాయి? దీని వెనుక అక్కడి వారి నుంచి కీలక సాయం అమెరికా సేనలు అంది ఉంటుందా? అనే అనుమానాలు తీవ్రతరం అయ్యాయి.

పైగా మదురోనే తాము ఏ విధంగా పట్టుకుంది? న్యూయార్క్‌కు ఏ రీతిన తీసుకువెళ్లిందనేది ట్రంప్ మీడియా సమావేశంలోనే తేటతెల్లం చేసేశారు. ఆపరేషన్‌కు అబసూల్యుట్ రిసాల్వ్ సంకేత నామం పెట్టుకున్నారు. ముందుగానే మిలిటరీ కాంపౌండ్ నమూనా చిత్రపటం సేకరించి పెట్టుకున్నారు. నిర్బంధం తరువాత క్షణాల వ్యవధిలోనే మదురో దంపగులను కరాకస్ వీధుల మీదుగా తీరంలోని యుద్ధ నౌక వద్దకు తీసుకువెళ్లడం గురించి స్కెచ్ వేసుకుని అమలు పర్చారని వెల్లడైంది. మదురో తప్పించుకునే అవకాశం లేకుండా చేశామని తెలిపారు.

న్యూయార్క్ డిటెన్షన్ సెంటర్‌లో మదురో దంపతుల నిర్బంధం

అమెరికా సేనల బందీగా మారిన తరువాత న్యూయర్క్‌లో మదురో ఆయన భార్యను న్యూయార్క్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. అక్కడనే ఆయన భార్య సహా ఉండాల్సి ఉంటుంది. 63 సంవత్సరాల మదురోపై నార్కో టెర్రరిజం క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయని ట్రంప్ అధికార యంత్రాంగం తెలిపింది. మదురో ప్రభుత్వం డ్రగ్స్ తయారీ, రవాణా, స్మగ్లర్లకు ఆశ్రయం కల్పించడం, అమెరికాకు భారీ స్థాయిలో ప్రమాదకర మత్తు మందు పంపించడం, భారీ సంఖ్యలో అక్రమంగా జనాలను తరలించడం వంటి చర్యలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి.

అమెరికన్ల ప్రాణాలతో చెలగాటమాడారని కూడా ట్రంప్ మండిపడ్డారు. మదురోచ ఆయన భార్య, కుమారుడు, మరో ముగ్గురు వ్యక్తులపై అమెరికా చట్ట పరిరక్షణ సంస్థలు కేసులు దాఖలు చేశాయి. వీరిపై ఈ చట్టాల పరిధిలో విచారణ జరుగుతుంది. నార్కో టెర్రరిజం, కొకైన్ అక్రమ రవాణా కుట్ర , మెషిన్‌గన్స్ ఇతర విధ్వంసకర పరికరాలు ఉండటం వంటివి మదురో ఇతరులు ఇప్పుడు ఎదుర్కొనే అభియోగాలు. సోమవారం న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆయనను తొలిసారిగా ప్రవేశపెడుతారు.