
మన తెలంగాణ/ హైదరాబాద్ : అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అత్యంత జుగుత్సకరమైన, అసభ్యకరమైన భాషలో అబద్దాల వరద పారించాడని, అసెంబ్లీలో అబద్దాలకు ఆస్కారం లేదంటూనే ఆసాంతం అబద్దాలనే ప్రయోగించాడని బిఆర్‌ఎస్ ఎల్పీ ఉప నాయకులు హరీష్‌రావు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ వేదికగా పరమ బూతు పదాన్ని ప్రయోగించిన రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెసే తెచ్చిందనడం రేవంత్ పిచ్చిప్రేలాపన తప్ప మరొకటి కాదని వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 2009 సాధారణ ఎన్నికల సమయంలో సీఎంవో నోట్ ఇస్తే, 2014 ఎన్నికల సమయంలో డిపిఆర్ కోసం జీవో జారీ చేసిన చరిత్ర నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. డిపిఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికే 5ఏళ్లు చేసిన మీరా
మా గురించి అవాకులు చెవాకులు పేలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45టిఎంసీలకు తగ్గించిన మాట నిజమేనని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి చెప్పక తప్పలేదన్నారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎజెండాలోని అంశాలను సగం సగం చదువుతూ, వాక్యాలను వక్రీకరిస్తూ, సభను తప్పుదోవ పట్టించిన సిఎం చవకబారు ఎత్తుగడకు తగిన సమాధానాన్ని ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా తాను ఇవ్వబోయే పిపిటిలో వివరిస్తానని . ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తం చేసిన ఆరోపణలకు, చెప్పిన అబద్దాలకు తగిన సమాధానం పూర్తి సాక్ష్యాధారాలతో వివరిస్తానని, ముఖ్యమంత్రి పిట్ట కథలను, ఉత్తం కట్టు కథలను మీడియా సాక్షిగా తిప్పికొడుతామని హరీష్ రావు అన్నారు.