
లక్నో: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్ జిల్లాలో ఆరేళ్ల బాలికపై ఇద్దరు అత్యాచారం చేయడమే కాకుండా ఇంటిపై కప్పు నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలతో బాలిక మృతి చెందింది. ఈనెల 2న ఈ దుర్ఘటన జరిగింది. సికంద్రాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అద్దె ఇంట్లో రాజు, వీరు కశ్యప్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. అదే బిల్డింగ్ లోని వేరే పోర్షన్‌లో ఉంటున్న ఆరేళ్ల బాలిక ఇంటి పై భాగంలో ఆడుకుంటుండగా, రాజు, కశ్యప్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తమ నేరం బయటపడకుండా ఉండడానికి ఆ బాలికను కిందకు తోసేయడంతో తీవ్రంగా గాయపడింది.
ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. బాలిక తండ్రి అనుమానంతో రాజు, కశ్యప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న నిందితులు ఇద్దరి కోసం పోలీసులు గాలించి చివరకు నిర్మాణంలో ఉన్న ఒక భవనంలో దాక్కున్న వారిని పట్టుకున్నారు. పోలీసులపై నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు వారిపై ఎదురు కాల్పులు జరిపి అదుపు లోకి తీసుకున్నారు.