
ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ సవరణ చేశారు. శనివారం శాసనసభలో పంచాయతీరాజ్ చట్టంలోని 21 వ సెక్షన్ సవరణ బిల్లును మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి గతంలో ఆర్డినెన్స్ జారీ కాగా శనివారం మంత్రి సీతక్క బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రతను పాటిస్తున్నాయని, అదే ఉత్తరాది రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితులు లేవనిఅన్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాజకీయ ఆధిపత్యం పెరుగుతోందని చెప్పారు. మన రాష్ట్రంలో జనాభా నియంత్రణ పూర్తిస్థాయిలో పాటించడం వల్ల జనాభా తగ్గిపోయే అవకాశం ఉందని,
భవిష్యత్తు దృష్టిలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలకు మించి ఉండకూడదని నిబంధనను తొలగిస్తున్నామని శనివారం శాసనసభలో మంత్రి సీతక్క ప్రకటించారు. సభలో సభ్యులంతా మా నిర్ణయాన్ని స్వాగతించారంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తుల్లో అవసరం ఉంటే మరో విధంగా నిబంధనలను పెట్టుకుందామని సూచించారు. అలాగే వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని జైన్ తిరుమలాపూర్ గ్రామ పేరును జయన్న తిరుమలాపూర్ గా మార్చే బిల్లును మంత్రి సీతక్క శాసన సభలో ప్రవేశపెట్టారు. అనంతరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ బిల్లును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కఅసెంబ్లీలో ప్రవేశపెట్టారు.