
బిఆర్‌ఎస్ అవినీతిపై కవితే మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీకి రావడానికి తమ తప్పులు, అవినీతి ఎక్కడ బయట పడుతాయోనని బిఆర్‌ఎస్ నేతలు జంకుతున్నారన్నారు. కాంగ్రెస్ అడిగే ప్రశ్నలకు, కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక తోకముడిచి పారిపోయారని ఎద్దేవా చేశారు. కవిత మేము అడిగిన ప్రతి ప్రశ్నలకు అవినీతి జరిగింది వాస్తవం అని స్వయంగా చెపుతున్నారని గుర్తు చేశారు. కెసిఆర్ కృష్ణా జలాలపై అసెంబ్లీకి చర్చకు రాకపోతే బిఆర్‌ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని స్వయంగా కవిత అంటున్నారని చెప్పారు. ప్రజలకు క్షమాపణ చెప్పి కెసిఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఉపాధి హామీ పథకంపై మాట్లాడాల్సి వస్తుందనే బిఆర్‌ఎస్ నేతలు వాకౌట్ చేశారని ఆరోపించారు.