Reading Time: < 1 minute

జల్నా: ముస్లిం మహిళ ముఖంపై నుంచి హిజాబ్‌ను బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తొలగించడంపై తీవ్ర వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ తీవ్ర హెచ్చరిక చేశారు. ఎవరైనా సరే దురుద్దేశంతో ముస్లిం మహిళను తాకడానికి ధైర్యం చేస్తే తాను చెయ్యినరికేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర లోని జల్నా సిటీలో శుక్రవారం ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాము సెక్యులర్ పార్టీలమని చెప్పుకునే కొంతమంది నేతలు గూండాలకు, నేరాల సంఘటనలపై అనుకూలత చూపిస్తూ ముస్లింలకు మద్దతు ఇవ్వడానికి వెనుకాడుతుంటారని వ్యాఖ్యానించారు. హిజాబ్ వివాదంపై నితీశ్ కుమార్‌ను ఆయన టార్గెట్ చేశారు.

హిజాబ్ వివాదంలో నితీశ్‌ను చేర్చడం ఉత్తరప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ తోసిపుచ్చుతూ ముస్లిం మహిళను ఎక్కడో ఒకచోట నితీశ్ తాకితే ఏం జరుగుతుంది? అని ఎద్దేవా చేశారు. అయితే నిషాద్ పార్టీ చీఫ్ తరువాత ఈ వ్యాఖ్యను తప్పుగా మార్చారని వివరణ ఇచ్చారు. ఎఐఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ జనవరి 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎఐఎంఐఎం అభ్యర్థులు 17 మంది తరఫున ప్రచారం సాగిస్తున్నారు. ఎఐఎంఐఎం ఎన్నికల చిహ్నం కైట్ (పతంగి)ని రద్దు చేయాలని మహారాష్ట్ర సామాజిక న్యాయమంత్రి, శివసేన నేత సంజయ్ శిర్సాత్ డిమాండ్ చేయడాన్ని జలీల్ తీవ్రంగా విమర్శించారు.