
ప్రెసిడెంట్ మదురో, భార్య బందీ ..వేరే దేశానికి తరలింపు
న్యూయార్క్‌లోనే చట్ట ప్రకారం శిక్ష అని అగ్రరాజ్యం వెల్లడి
కరాకస్/వాషింగ్టన్ : కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా వెనెజులాపై శనివారం తెల్లవారుజామున భారీ స్థాయిలో వైమానిక సైనిక దాడులకు దిగింది. అత్యంత అసాధారణ సైనిక చర్యను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైనిక బలగాలు చేపట్టాయి. దాడికి దిగడమే కాకుండా, గంటల వ్యవధిలోనే వెనెజులా అధ్యక్షులు నికోలాస్ మదురోను ఆయన సతీమణిని సైన్యం తమ కస్టడీలోకి తీసుకుంది. తరువాత వారిని గుర్తు తెలియని ప్రాంతానికి దేశం వెలుపలికి తరలించారు. దాడి తరువాత దేశాధ్యక్షుడిని బందీగా తీసుకువెళ్లిన విషయాన్ని ట్రంప్ తమట్రూత్ సోషల్ మీడియా సమాచారంలో తెలిపారు. అంతకు ముందు కొద్ది గంటల ముందు మదురో అమెరికా దాడుల గురించి ప్రకటన వెలువరించారు. అమెరికా అక్రమ రీతిలో తమ దేశంపై దాడికి దిగిందని, పలు ఇతర చర్యలకు దిగుతుందని తెలిపారు.
ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపు నిచ్చారు. తరువాత ఆయన నుంచి ఎటువంటి సందేశం వెలువడలేదు. కాగా దాడుల దశలో రాజధాని కరాకస్ భారీ స్థాయిలో వైమానిక దాడులతో, భీకరమైన చప్పుళ్లు మార్మోగాయి. దీనితో జనం ఉరుకులు పరుగులతో వీధుల్లోకి వచ్చారు. దేశంలో అత్యయిక స్థితిని ప్రకటించినట్లు మదురో తెలిపారు. అమెరికా దారుణ రీతిలో పౌరుల, సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోందని ప్రెసిడెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సామ్రాజ్యవాద దాడి, దీనిని అంతా కలిసి జనసామాన్య బలంతో తిప్పికొట్టాల్సి ఉందని అధికారిక పిలుపు వెలువరించారు. కాగా తెల్లవారుజామునే ట్రంప్ తమ ప్రకటనలో మదురో జంటను తాము కస్టడీలోకి తీసుకున్నామని వేరే చోటికి తరలించామని తెలిపారు. అమెరికా చట్ట భద్రతా సంస్థల అధికారిక వ్యవస్థ పరిధిలోనే చట్ట ప్రకారం దాడికి దిగినట్లు, ఇంతకుముందటి నేరాభియోగాల క్రమంలో దేశ ప్రెసిడెంట్‌ను పట్టుకు వెళ్లినట్లు వివరించారు. దాడులు మెరుపువేగంతో జరిగాయి.
ఇకపై దేశంపై దాడులు ఏమీ ఉండవు. పూర్తి స్థాయి వివరాలు తెలియచేయడం జరుగుతుందని ట్రంప్ వివరించారు. దేశాధ్యక్షుడిని బంధించడమే తమ ఆపరేషన్ అనే విషయాన్ని పరోక్షంగా తెలిపారు. నూతన సంవత్సరం ఆరంభం అయిన మూడోరోజు ఈ దేశం అమెరికా దాడులతో భీతిల్లింది. పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. కనీసం ఏడు పేలుళ్లతో రాజధాని దద్దరిల్లినట్లు వెల్లడైంది. సైనిక దాడులలో ఎవరైనా చనిపోవడం లేదా గాయపడటం వంటి విషయాలు నిర్థారణ కాలేదు. అయితే నిర్ణీత రీతిలోనే కొన్ని ప్రాంతాలనే ఎంచుకునే అమెరికా సేనలు పరిమిత స్థాయిలో ఆపరేషన్ సాగించి, మదురోను బందీగా చేసుకుని తీసుకుని వెళ్లినట్లు నిర్థారణ అయింది. అరగంట పాటు దాడులు జరిగినట్లు తెలిసింది. దాడులు విజయవంతం అయ్యాయి. ప్రతిఘటన లేదు. ఇకపై దాడులకు అవకాశం ఉండదని ట్రంప్ ప్రకటించారు. ఇక దాడుల తరువాత వెనెజులా గగనతలం మీదుగా అమెరికా విమానాల రాకపోకలను నిలిపివేశారు. అమెరికాలో నార్కో టెర్రరిజానికి వెనెజులా అధ్యక్షుడు వ్యూహాత్మకంగా పాల్పడ్డాడని అభియోగాలు ఉన్నాయి. ఈ చర్యలను మానుకోవాలని పలుసార్లు హెచ్చరించినా వినలేదని, మాదకద్రవ్యాల బారి నుంచి అమెరికా యువతను రక్షించుకునేందుకు ఈ సైనిక చర్య తప్పలేదని ట్రంప్ తమ ప్రకటనలో తెలిపారు.
అమెరికాలోనే మదురో దంపతులకు శిక్ష ః అమెరికా
వెనెజులా అధ్యక్షులు మదురోను ఆయన భార్య సిలియా ఫోర్స్‌ను అమెరికా గడ్డపైనే విచారించి తగు విధంగా శిక్షిస్తామని అమెరికా అటార్నీ జనరల్ పామ్‌బోండి ప్రకటన వెలువరించారు. 2020లో న్యూయార్క్‌లో ఆయనపై దాఖలు అయి ఉన్న అభియోగాల పరిధిలో విచారిస్తాం. ఇద్దరిని శిక్షించడం జరుగుతుందని తెలిపారు. అమెరికా న్యాయస్థానాలు పరిధిలో అమెరికా నేలపైనే క్రిమినల్ నేరాలపై విచారణ జరుగుతుంది. ఇదే తమ ప్రతిన అని అటార్నీ జనరల్ సామాజిక మాద్యమంలో తెలిపారు. మదురోను అమెరికా న్యూయార్క్‌లో ఐదేళ్ల క్రితమే అమెరికా వ్యతిరేక చర్యల నేరాల పరిధిలో దోషిగా ఖరారు చేసింది. అయితే అప్పట్లో ఆయన భార్య కూడా ఈ నేరాభియోగం పరిధిలోకి వచ్చారా? లేదా అనేది తెలియలేదు.
దేశం ఎవరి ఏలుబడిలోకి వెళ్లింది?
అమెరికా దాడులు, తరువాత మదురో నిర్బంధం తరలింపు తరువాత వెనెజులా ఎవరి అధికారంలోకి వెళ్లింది? మదురో ఎక్కడున్నారు? అనేది వెంటనే తెలియలేదు. ఆయన బతికే ఉన్నారా లేదా తమకు తెలియాల్సి ఉందని ఉపాధ్యక్షులు డెల్కీ రోడ్రిగూ అధికారిక టీవీలో ప్రసంగిస్తూ చెప్పారు. తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో అమెరికా దాడులు జరిగాయి. తమ నేతకు ఏమి జరిగిందో అనే ఆందోళన ఉందని ఉపాధ్యక్షులు ఆందోళన వ్యక్తం చేశారు.