
న్యూఢిల్లీ: బుధ్ధుని పవిత్ర అవశేషాలు కేవలం కళాఖండాలు మాత్రమే కాదని, భారత దేశ మహత్తర వారసత్వంలో భాగాలని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. పిప్రహ్వా వద్ద బుధ్ధునికి సంబంధించిన పవిత్ర అవశేషాలైన ఎముక తునకలు, విలువైన రత్నాల ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలో కిలారై పితోరా కల్చరల్ కాంప్లెక్స్‌వద్ద ఈ ప్రదర్శన ఏర్పాటైంది.
ఈ సందర్భంగా ప్రధాని పిప్రహ్వా బౌద్ధ అవశేషాలు వియత్నాం, థాయ్‌లాండ్, రష్యా తదితర దేశాలన్నీ చుట్టి వచ్చాయని, భక్తి విశ్వాసాలతో బౌద్ధ భక్తులు, ప్రజలు నివాళులు అర్పించారని చెప్పారు. 125 సంవత్సరాల తరువాత ఈ అవశేషాలు భారత ప్రభుత్వం, గోడ్రెజ్ గ్రూపు సమష్టి కృషి వల్ల భారత్‌కు తిరిగి వచ్చాయని గుర్తు చేశారు. గత మేలో ఈ అవశేషాలు హాంకాంగ్‌లో వేలం వేయవలసి ఉండగా అడ్డుకుని తీసుకు రావడమైందన్నారు. వ్యక్తిగతంగా తన జన్మస్థలానికి బౌద్ధ క్షేత్రాలకు ఉన్న సంబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. గుజరాత్ లోని వడ్నాగర్ బౌద్ధ అధ్యయన కేంద్రమని, వారణాసి సమీపాన సారనాథ్ క్షేత్రం ఉందని, అక్కడే బుద్ధుడు తన మొదటి సందేశం వినిపించారన్నారను.
వారణాసి నుంచి తాను పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నానన్నారు. ప్రపంచం మొత్తం మీద ఉన్న బౌద్ధక్షేత్రాల్లో బోధి వృక్షం మొక్కలు నాటాలని సూచిస్తానని చెప్పారు. బుద్దుడు తన సందేశాలను , బోధనలను పాళీ భాషలోనే వినిపించారని, ఈ కారణంగా పాళీ భాషకు శాస్త్రీయ హోదా కల్పించినట్టు తెలిపారు. దీనివల్ల బుద్ధుడు ధర్మం గురించి అసలు ఏం చెప్పారో తెలుస్తుందన్నారు. బౌద్ధ సంప్రదాయంపై పరిశోధన మరింత బలోపేతం అవుతుందన్నారు. భావితరాలకు బౌద్ధ సంప్రదాయం సహజమైన రీతిలో చేరేలా తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు.