
హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ మ్యాప్ ఆధారంగా విభజించినట్లున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉందని చెప్పారు. సికింద్రాబాద్‌కు ఎంతో చరిత్ర ఉందని, ఇష్టం వచ్చినట్లు విభజన చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ఈనెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వెల్లడించారు.మద్దతిచ్చే పార్టీలతో కలిసి నిరసనలు తెలియజేస్తామని పేర్కొన్నారు. టెక్నికల్ స్టడీ లేకుండా ప్రాంతాలను విభజిస్తున్నారని, జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని వాపోయారు. సికింద్రాబాద్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సిఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చాలని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో శనివారం అసెంబ్లీలో బిఆర్‌ఎస్ విప్ కె.పి వివేకానంద గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహానగర విభజనపై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదని, డివిజన్లను కూడా సరిగా విభజించ లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 24 నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని మండిపడ్డారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం బిఆర్‌ఎస్ హయాంలో 150 డివిజన్లు చేశామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు విభజిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనుల కోసం ప్రజలు నగరం మొత్తం తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారని, దీనిపై చట్టపరంగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు. అసెంబ్లీలో కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది ముఖ్యమంత్రులను, స్పీకర్లను చూశామని, ఇలాంటి ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను చూడలేదని పేర్కొన్నారు. స్పీకర్ కనీసం ప్రతిపక్ష సభ్యుల వైపు చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడడం ప్రతిపక్ష పార్టీ పని అని, స్పీకర్ ప్రతిపక్ష పార్టీని నిలువరిస్తున్నారని అన్నారు.
గంటన్నర పాటు రేవంత్ రెడ్డి బూతు పురాణం మాట్లాడుతున్న స్పీకర్ అడ్డు చెప్పలేదని వాపోయారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా వత్తాసు పలికారని అన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెబుతూనే… అభిప్రాయం చెప్పకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కె.పి వివేకానంద గౌడ్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని, అనుభవరాహిత్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం పరిస్థితి అయిపోయిందని ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సైతం విభజనపై గొంతెత్తుతున్నారని, ఎంఎల్‌ఎ మల్ రెడ్డి రంగారెడ్డి సైతం హైదరాబాద్ విభజనపై అసెంబ్లీలో నిరసన తెలిపాదని చెప్పారు. కుక్కలు చించిన విస్తరిలా హైదరాబాదును మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్క మంత్రి కూడా లేరని, విభజనపై మేయర్, ఉప మేయర్, కార్పొరేటర్లతో కనీసం సంప్రదించలేదు.
జిహెచ్‌ఎంసి కౌన్సిల్ సమావేశాల్లో కూడా దీనిపై సమగ్ర చర్చ జరగలేదని అన్నారు. దొంగ చాటున హైదరాబాద్ మహ నగర విభజన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని విమర్శించారు. పరిపాలన సాలభ్యం కోసం కెసిఆర్ కొత్త జిల్లాలు, మహానగర సంస్థలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ డివిజనులు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదని అన్నారు. రేవంత్ రెడ్డి మహానగర విభజనను గందరగోళంగా చేస్తున్నారని, దీనిపై ప్రజా పోరాటం చేస్తామని వెల్లడించారు. సిఎంకు కలెక్షన్ల మీద తప్ప దేని మీద ధ్యాస లేదని ఆరోపించారు.