
బంగ్లాదేశ్‌లో మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఖోకన్ చంద్రదాస్ (50) అనే వ్యాపారిపై కొందరు దుండగులు దాడి చేసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. వారి నుంచి తప్పించుకునేందుకు నాడు చెరువులో దూకిన ఆయన, తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈమేరకు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. చంద్రదాస్ క్యూర్‌బంగా బజార్‌లో ఔషధాలు , మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల దుకాణాన్ని మూసి ఆటోలో ఇంటికి బయలుదేరగా, మార్గమధ్యలో కొందరు దుండగులు ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో చంద్రదాస్‌పై దాడి చేశారు. అనంతరం ఆయన తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డు పక్కనే ఉన్న చెరువు లోకి దూకేశారు.
తర్వాత స్థానికులు ఆయనను కాపాడి ,ఆస్పత్రికి తరలించారు. తమకు శత్రువులు ఎవరూ లేరని ,ఆయనపై దాడి ఎందుకు చేశారో తెలియదని ఖోకన్ భార్య సీమాదాస్ పేర్కొన్నారు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే దీపూదాస్ హత్య జరిగింది. కొన్ని రోజులకు సామ్రాట్ అనే వ్యక్తి గ్రామస్థుల మూక దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం బజేంద్ర బిశ్వాస్ అనే మరో వ్యక్తిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఆ తర్వాత ఖోకన్‌పై దాడి జరగ్గా,ఆయన తాజాగా మరణించాడు. బంగ్లాదేశ్‌లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరుసగా హిందువులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.