Reading Time: 2 minutes

హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టులో ఒక మోటారు ఆన్ చేసి జాతికి అంకితం చేస్తున్నామని ప్రకటించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ చేసిన తెల్లారే ఆ మోటార్ ను మళ్లీ ఆఫ్ చేశారని అన్నారు. ఈ సందర్భంగా శనివారం శాసనసభ సమావేశాలో ఉత్తమ్ మాట్లాడారు. కాళేశ్వరంపై రూ.90 వేల కోట్లు ఖర్చు చేసినవారు.. పాలమూరుకు రూ.27 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టును రోజుకు 3 టిఎంసిలు తరలించేలా పెంచుకుంటూ పోయారని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టును 1.5 టిఎంసి నుంచి ఒక టిఎంసికి తగ్గించారని, నీళ్లుతీసుకునే సోర్స్ ను జురాల నుంచి శ్రీశైలానికి మార్చి.. తీవ్ర నష్టం చేశారని మండిపడ్డారు. కృష్ణానది ప్రాజెక్టులను బిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి.. పాలమూరును నిర్లక్ష్యం చేశారని ఆరోపణ చేశారు. కావాలనే పాలమూరు ప్రాజెక్టును స్లోడౌన్ చేశారని ధ్వజమెత్తారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం 30 శాతం నిధులు ఖర్చు పెట్టారని అన్నారు. 30 శాతం నిధులు ఖర్చుతో 90 శాతం ప్రాజెక్టు పూర్తి కావడం సాధ్యమేనా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015 లో జివో ఇచ్చి 2022లో డిపిఆర్ సమర్పించారని, కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని చెప్పారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టిఎంసిలు తరలించే అవకాశం ఉండేదని, జూరాల నుంచి అయితే 60 రోజుల్లో 121 టిఎంసిలు తీసుకునే వాళ్లమని తెలియజేశారు. సోర్స్ ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చటం వల్ల 68 టిఎంసిల స్థాయికి పడిపోయిందని, ఆయకట్టు కాల్వాల గురించి ప్రస్తావన, భూసేకరణ లేకుండానే డిపిఆర్ రూపొందించారని అన్నారు. ప్రాణహిత- చేవెళ్లను తుమ్మిడిహట్టి నుంచి మార్చి గోదావరిలో అన్యాయం చేశారని, పాలమూరును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి.. కృష్ణా బేసిన్ లోనూ అన్యాయం చేశారని అన్నారు. జూరాల నుంచి అయితే 22 పంపుల ఏర్పాటుతో ప్రాజెక్టు పూర్తి అయ్యేదని పేర్కొన్నారు.

జూరాల నుంచి శ్రీశైలానికి మార్చటం వల్ల పంపుల సంఖ్య 37కు పెరిగిందని, ఆయకట్టు కాల్వల గురించి ప్రస్తావన, భూసేకరణ లేకుండానే డిపిఆర్ రూపొందించారని అన్నారు. శ్రీశైలం బ్యాంక్ వాటర్ నుంచి ఎపి అక్రమంగా నీరు తరలిస్తుంటే చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. ఎపి ప్రభుత్వం రోజుకు 13 టిఎంసిలు తరలించుకుపోయేలా ప్రాజెక్టును విస్తరించిందని, ఎపి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలు ప్రాజెక్టు నిర్మిస్తుంటే బిఆర్ఎస్ కనీసం అభ్యంతరం చెప్పలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ ఎత్తి పోతలపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఎపి ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన రాయలసీమ ప్రాజెక్టు పనులు నిలిపివేశామని చెప్పారు. 2024-25 సీజన్ లో కృష్ణా జలాల్లో ఎక్కువ నీరు వాడుకున్నామని, బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో నీటిపారుదలశాఖపై రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టిఎంసిలకు ..తెలంగాణకు 34 శాతం, ఎపికి 66శాతం వాటాకు ఒప్పుకుని కెసిఆర్ తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రైబునల్ తీర్పు వచ్చేవరకు 299 టిఎంసిలు చాలు అని సంతకం పెట్టారని, కృష్ణా నదీ పరివాహకం ప్రకారం మనకే అధిక వాటా రావాల్సి ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 550 టిఎంసిలు కావాలని వాదించామని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కింద 39 వేల ఎకరాల భూసేకరణ ఇంకా పెండింగ్ లో ఉందని అన్నారు. జూరాల నుంచి అయితే 414 మీటర్ల లోతు నుంచి నీరు తీసుకునేవాళ్లమని, శ్రీశైలానికి మార్చటం వల్ల 560 మీటర్ల ఎత్తుకు నీరు ఎత్తి పోయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. జూరాల నుంచి అయితే 22 పంపుల ఏర్పాటుతో పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేదని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 79శాతం, ఎపికి 21 శాతం కేటాయించాలని వాదించామని అన్నారు. నీటి కేటాయింపులు ఉన్నా.. నీటిని నిల్వచేసుకునే ప్రాజెక్టులు మనకు లేవని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు.