Reading Time: < 1 minute

భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపిఎల్‌లో ఆడించటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే గురువారం ఈ విషయంపై బిసిసిఐ స్పందించినట్లు వార్తలు వచ్చాయి. బంగ్లా ఆటగాళ్లను ఐపిఎల్‌లో ఆడకుండా నిరోధించడంపై తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని.. ఇది తమ చేతుల్లో లేని వ్యవహారమని.. ఇంతకు మంచి ఏమీ మాట్లాడేది లేదని బిసిసిఐ పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి.

ఈ ఏడాది ఐపిఎల్ కోసం జరిగిన వేలంలో రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఏకంగా రూ.9.2 కోట్లకు దక్కించుకుంది. ఐపిఎల్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లకు దక్కిన అత్యధిక అమౌంట్ ఇదే కావడం విశేషం. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిసిసిఐ కెకెఆర్ జట్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెహమాన్‌ను వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా బిసిసిఐ ఆదేశించింది. ఈ విషయాన్ని బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా ధృవీకరించారు.

సైకియా వార్తా సంస్థ ఎఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుత పరిణామాల దృష్ట్యా.. కెకెఆర్ తమ జట్టులోని బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని బిసిసిఐ ఆదేశించింది. ఒకవేళ కెకెఆర్ అతడికి ప్రత్యామ్నాయంగా ఇంకో ఆటగాడిని ఎంచుకుంటామని కోరితే బిసిసిఐ అందుకు అనుమతినిస్తుందని కూడా తెలియజేశాము’’ అని అన్నారు. 2016లో ఐపిఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెహమాన్ ఇప్పటివరకూ 60 మ్యాచులు ఆడి.. 65 వికెట్లు తీసుకున్నాడు.