
హైదరాబాద్: అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కొండగట్టు తనకు పునర్జన్మిచ్చిందని అన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రత్యేక పూజలు పవన్ ప్రారంభించారు. కొండగట్టులో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల కోసం రూ.35.19 కోట్ల టిటిడి నిధులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని గతంలో తనను కోరారని, టిటిడి సభ్యులు, తెలంగాణ నాయకులు అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని కొనియాడారు. భక్తుల కోసం కోరుకున్న బలమైన సంకల్పమిదని, విద్యుత్ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. కొండగట్టు అంజన్నే తనను కాపాడారని, ఆంజనేయస్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం తమ అదృష్టమని పేర్కొన్నారు. గిరిప్రదక్షిణకు తన వంతు సహకారం అందిస్తానని, కొత్త ఏడాది ఆంజనేయస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.