Reading Time: 3 minutes

‘మేము సజీవంగా సమాధుల్లో బతుకుతున్న వాళ్లం. అక్షరం మాకు నిషిద్ధం. భగవంతుడు మా మొర ఆలకించి బ్రిటిష్ వారిని పాలకులుగా పంపాడు. ఇప్పుడు మమ్మల్నెవరూ వేధించి బాధించలేరు. ఉరితీసి చంపటానికి, సజీవంగా పాతిపెట్టడానికి సాహసించరు. మా ముందు తరాలకు కూడా భవిష్యత్తుపై భరోసా ఉంది. మేమిప్పుడు ఒంటి నిండా బట్ట కట్టగలుగుతున్నాం. స్వేచ్ఛగా జీవిస్తున్నాం. ఆంక్షలు, నిషేధాలు తొలగిపోయి బజారులూ, అందరూ నడిచే బాటలు, ఉద్యాన వనాలు మాకు తలుపులు తెరిచాయి. 1849 సంవత్సరంలో జ్యోతిబా ఫూలే, సావిత్రీ బాయి ఫూలే ప్రారంభించిన ఒక బాలికల పాఠశాలలో చదివిన మాతంగ కులానికి చెందిన విద్యార్థిని రాసిన ఉత్తరంలోని ఒక భాగమిది. ఈ బాలిక చైతన్యానికి అండదండలు, అన్ని రకాల ప్రేరణలకు జ్యోతిబా ఫూలే, సావిత్రా బాయి ఫూలేల మహోద్యమం కారణం. భారత దేశంలోని సామాజిక పరిస్థితులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి ఆధునిక ప్రతిఘటన సారథులు ఫూలే దంపతులు. ఆ దంపతుల ఆలోచనలు, ఆచరణ. తదనంతర మహత్తర విప్లవానికి పునాదులు వేశాయి.

బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశ సామాజిక గమనాన్ని నిర్దేశించిన విప్లవకారుడు. అటువంటి మహోన్నత నేత తనకు ముగ్గురు గురువులని ప్రకటించారు. గౌతమ బుద్ధుడు, కబీరు, జ్యోతిభా ఫూలేలను తన గురువులని చెప్పాడంటే ఫూలే సాగించిన ఉద్యమం ఆనాటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. జ్యోతిబా ఫూలే సాగించిన ఉద్యమంలో ఆయన జీవిత సహచరి సావిత్రీ బాయి ఫూలే భాగం మాత్రమే కాదు. ఇద్దరి సామాజిక పరివర్తన ఉద్యమాన్ని కలిపి చూడాల్సిందే. ఇంకొక రకంగా చెప్పాలంటే సావిత్రీ బాయి ఫూలే సాహచర్యం వారిద్దరి పట్టుదలను రెట్టింపు చేసిందనే చెప్పాలి. సావిత్రీ బాయి ఫూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్‌లో ఖండిజీ నేవసే లక్ష్మి భాయి దంపతులకు జన్మించారు. ఆమెకు సిద్ధూజీ, సఖరామ్, శ్రీపతి అనే ముగ్గురు తమ్ముళ్లు. పుణెకు చెందిన జ్యోతిబా ఫూలేతో సావిత్రీ బాయికి తొమ్మిది ఏటనే పెళ్లి జరిగిపోయింది. ఫూలేకు అప్పుడు 13 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో చదువు కొన్ని కులాలకే పరిమితమైన అవకాశం.

అందులో కూడా అమ్మాయిలకు అవకాశం లేదు. కాని జ్యోతిబా ఫూలే మాత్రం తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. 1843 ఒక వైపు చదువు కొనసాగిస్తూనే, తాను పని చేస్తున్నమామిడి తోటలో చెట్ల నీడన మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు. అందులో సావిత్రీ బాయి కూడా ఒక విద్యార్థి. అయితే ఇది సరిపోదని, పూర్తిస్థాయిలో పాఠశాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం 1832లోనే బాలికల కోసం పుణెలోని బుద్ధవార్ పేటలో పాఠశాలను ప్రారంభించింది. కానీ అందులో చేరాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి కావాలి. అది ఫూలేకు నచ్చలేదు. అందుకే 1848 జనవరి 14వ తేదీన అదే వాడలో తాత్యా సాహెబ్ అనే బ్రాహ్మణుని ఇంటిలో బాలికల పాఠశాలను ఫూలే ప్రారంభించారు. ఆ పాఠశాలలో బాలికలను చేర్పించటానికి సావిత్రీ బాయి ఇంటింటికీ తిరిగి అమ్మాయిలను పాఠశాలకు పంపాలని అర్థించేవారు. మొట్టమొదటిగా అన్నపూర్ణా జోషి, సుమతీ, దుర్గాదేశ్ ముఖ్, మాధవి దత్తే, సోనూ పవార్, జాన్ కదిడిలే అనే ఆరుగురు అమ్మాయిలు ఈ పాఠశాలలో అడుగుపెట్టారు.

ఆ తరువాత 1851 సెప్టెంబర్ 1 రాస్తాపేటలో ఫూలే దంపతులు మరో పాఠశాలను తెరిచారు. దీనితో పాఠశాలల్లో చేరే అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పాఠశాల సంఖ్య కూడా 18 పెరిగింది. ఇందులో కొన్ని పాఠశాలలను ఆనాడు అంటరాని కులాలైన మహర్, మాతంగ్ కులాల పిల్లల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం విశేషం. ఈ పాఠశాలల మీద దుష్ప్రచారంతో పాటు ఫూలే దంపతులపై దాడులు మొదలయ్యాయి. ఆ పాఠశాలలను నడవకుండా చేయడానికి భౌతిక దాడులకు ఛాందసులు చాలా సార్లు తెగబడ్డారు. అంతటితో ఆగకుండా, జ్యోతిబా ఫూలే తండ్రి గోవింద భయపెట్టి కొడుకుని, కోడలిని ఇంటి నుంచి పంపించడంలో కృతకృత్యులయ్యారు. ఆ సమయంలో సావిత్రీ బాయి స్నేహితురాలు ఫాతిమా షేక్ ఆశ్రయం ఇచ్చారు. ఎన్ని దాడులు జరిగినా, దౌర్జన్యాలు చేసినా పాఠశాలల నిర్వహణ ఆగలేదు. సావిత్రీ బాయి పాఠశాలకు వెళ్తున్న సమయంలో పేడతో, రాళ్లతో ప్రత్యక్షంగా, చాటుగా దాడి చేసేవారు. ఇది ప్రతి రోజు జరిగేది. అయితే సావిత్రీ బాయి ఫూలే వెనుకడుగు వేయలేదు. పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఒక పాత చీర కట్టుకొని మరొకటి వెంట తీసుకుని వెళ్లేవారు.

పేడ, మూత్రంపడ్డ ఆ చీరను పాఠశాలలో మార్చుకొని వెంట తీసుకొచ్చిన చీరను ధరించి పాఠశాలలో పాఠాలు చెప్పేవారు సావిత్రీ బాయి. పాఠశాలల నిర్వహణను అడ్డుకోవడానికి హిందూ ఛాందసవాదులు చేయని ప్రయత్నం లేదు. ఒక యువకుడిని రెచ్చగొట్టి సావిత్రీ బాయి మీద దాడి చేయించాలని చూశారు. ఈ సంఘటనను ముందే ఊహించిన సావిత్రీ బాయి యువకున్ని పట్టుకొని చెడామడా చెంపలు వాయించింది. ఆ ప్రతిఘటనను ఊహించని ఆ యువకుడు సావిత్రీ బాయి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి మరెవ్వరూ, ఇంకెప్పుడూ దాడి చేయడానికి సాహసించలేదు. ఆ సంఘటనతో సావిత్రీ బాయి ఫూలే మీద అణగారిన కులాల విశ్వాసం పెరిగింది. కాసాబాయి అనే వితంతువు గర్భవతి అయింది. ఇది చాలా సంచలనాన్ని రేపింది. ఆమె కుటుంబం, కులం ఆమెను వెలివేసింది. సావిత్రీ బాయి ఆమెను చేరదీసి రక్షణ కల్పించింది. సంరక్షణ చేసింది. ఆత్మహత్యకు ప్రయత్నించిన కాసా బాయికి ధైర్యం చెప్పడం మాత్రమే కాకుండా ఆమె జన్మనిచ్చిన అబ్బాయిని ఫూలే దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఇటువంటి పిల్లల కోసం బాల రక్షణ సదనాన్ని ప్రారంభించారు. వితంతువులు గాని, ఇతర మహిళలు ఏ కారణం, రీత్యానైనా పిల్లలను కనాల్సి వస్తే, వారిని పెంచలేని పరిస్థితులు ఏర్పడితే వారికి ఆశ్రయం ఇచ్చేవారు.

అంతేకాకుండా 1897లో మహారాష్ట్రలో ప్రత్యేకించి పుణెలో ప్రబలిన ప్లేగు వ్యాధి సందర్భంగా ఆరోగ్య కార్యకర్తగా మారి ప్రజలకు సేవ చేసిన గొప్ప ధైర్యశాలి సావిత్రీ బాయి. దానితో ఆమె అనారోగ్యానికి గురైంది. చివరకు 1897 మార్చి 10వ తేదీన ఆమె తుది శ్వాస విడిచారు. అంతేకాకుండా జ్యోతిబా బాలే భౌతిక కాయానికి సావిత్రీ బాయి ఫూలే అంతిమ సంస్కారాలు నిర్వహించి పాత సాంప్రదాయాలకు చెల్లుచీటి రాసింది. అప్పుడే కాదు, ఇప్పటికీ మహిళలు అంతిమ సంస్కారాలు చేయడం చాలా అరుదు. అటువంటిది నూట నలభై ఏళ్ల క్రితం పుక్కిటి పురాణాలకు చరమ గీతం పాడింది. సావిత్రీ బాయి ఫూలే జీవితం సమరాల సమాహారం. అప్పటికే కింది కులాలు ప్రత్యేకించి మహిళలకు నిషేధమైన చదువును సాధించింది. అంతేకాకుండా తనే ఒక గురువుగా మారింది. దాడులను ఎదిరించే ధీశాలిగా మారింది. మహిళలకు అన్ని రకాల అండదండలను అందించడానికి ఆశ్రమాలను నెలకొల్పి ఒక అమ్మగా మారింది. ప్రజలు ప్లేగు రక్కసిరి బలై పోతుంటే వారి వెంట నడిచే వైద్యురాలిగా మారింది. చివరకు భర్త చితికి నిప్పంటించి ఒక కొడుకుగా మారింది. సావిత్రీ బాబాయి ఫూలే స్ఫూర్తి ఆనాడు, ఈనాడు మనకు వెలుగును చూపే దివిటీ. 

– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)

– నేడు సావిత్రీ బాయి ఫూలే జయంతి