
పేద వర్గాల శ్రేయస్సే ప్రజారోగ్యానికి సూచిక. ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, స్వచ్ఛమైన గాలి, నీరు ఇవన్నీ ప్రజల కనీస అవసరాలు. వీటిని మెరుగుపర్చడానికి ఆయా సంస్థలు 24 గంటలూ పనిచేయాల్సిందే. అయితే ఈ ప్రమాణాలు పాటించడంలో దేశం చాలావరకు వెనుకబడినట్టు కనిపిస్తోంది. దీనికి తాజా ఉదాహరణ మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ప్రాణాంతకమైన జలకాలుష్యం. ఒక పసికందుతో సహా 14మంది పైపుల నుంచి వచ్చిన మురుగునీరు తాగి ప్రాణాలు కోల్పోవడం సంచలనం కలిగిస్తోంది. 2000 మంది వరకు అస్వస్థులు కాగా, 200 మంది కన్నా ఎక్కువ మంది ఆస్పత్రి పాలయ్యారు. ఐసియులో 32 మంది చికిత్స పొందుతున్నారు. భగీరథ్‌పూర్‌లోని మరుగుదొడ్డివద్ద మంచినీటి పైపులైన్ లీకేజీవల్లనే ఈ విషాద సంఘటన జరిగిందని ఇండోర్ నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. మురుగునీరు వస్తోందని గతంలో ప్రజలు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా అధికార బిజెపి ఏమాత్రం పట్టించుకోకుండా కుంభకర్ణునిలా నిద్రపోతోందని కాంగ్రెస్‌తోసహా విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
వ్యర్ధాల విభజన, యాజమాన్య విధానం, ఇతర పరిశుభ్రతా చర్యలు చేపట్టడంతో దేశం లోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గత కొన్నేళ్లుగా ఇండోర్ రికార్డు సాధిస్తోంది. అలాంటి ఇండోర్‌లో ఈ జలకాలుష్యం చోటుచేసుకోవడం తీరని కళంకం. మంచినీటి సరఫరా కొత్త పైపులైన్ ఏర్పాటు చేయడంలో ఆలస్యమే ఈ పరిస్థితికి దారితీసిందని అధికార యంత్రాంగం చెబుతోంది. మధ్యప్రదేశ్‌లో గత రెండునెలల్లో తాగునీటి కలుషిత సంక్షోభానికి సంబంధించి ఇది రెండో సంఘటన. గత నవంబర్‌లో భోపాల్ సమీపాన వెల్లోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో కలుషిత జలాల సరఫరాతో చాలామంది విద్యార్థులు పచ్చకామెర్ల వ్యాధి బారినపడి ఆందోళన చేపట్టడం ఈ సందర్భంగా ప్రస్తావించడం అవసరం. ఏదేమైనా స్వచ్ఛభారత్ మిషన్, జలజీవన్ మిషన్‌లతో దేశం పురోగమిస్తున్న తరుణంలో ఇలాంటి ప్రాణాంతక నీటి కష్టాలు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
గ్రామీణ, పట్టణ విభజన జరిగి, 96% కుటుంబాలకు మెరుగైన నీటివనరులు వినియోగం లోకి వచ్చాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా చెబుతోంది. సాధారణంగా మున్సిపాలిటీ సరఫరా చేసే తాగు నీరు సురక్షితమని ప్రజలు విశ్వసిస్తుంటారు. ఈ నమ్మకానికి తగినట్టు ఎప్పటికప్పుడు నీటిసరఫరాలో తనిఖీలు జరిగి ఉంటే ఇండోర్‌లో ప్రజలు చనిపోయేవారు కాదు. ముందుగానే అధికార యంత్రాం గం మురుగునీటిని, కలుషిత నీటిని గుర్తించి ప్రజలను హెచ్చరించేది. కానీ ఈసారి అలా జరగలేదు. నాణ్యమైన నీరు లేనప్పుడు సరఫరా చేయడంలో అర్థం ఏముంది? మధ్యప్రదేశ్ లోని ఈ సంఘటనలు దేశంలోని మంచినీటి సరఫరా వ్యవస్థ లోపాలను ఎత్తి చూపుతున్నాయి. మిగతా రాష్ట్రాలు ఈ సంఘటనలతో మేలుకోకతప్పదు. 147 కోట్ల జనాభాగల దేశంలో నీటిద్వారా సంక్రమించే వ్యాధుల భారం ఎక్కువే. అన్ని రాష్ట్రాలు తక్షణం నీటిసరఫరా వ్యవస్థలో రసాయనాలు, మురుగునీటి కలుషితాలు కలియకుండా నిరోధించడానికి తనిఖీలు ఎప్పటికప్పుడు చేపట్టడం అవసరం.
కాలం చెల్లిన పైపులను మార్చి కొత్తవి ఏర్పాటు చేయడం లేదా మరమ్మతులు చేపట్టడం జరగాలి. కాలుష్య జలాల ముప్పుపై ప్రజలకు అవగాహన శిబిరాలు నిర్వహించాలి. పరిశుభ్ర చర్యలు సరిగ్గా నిర్వహించకుంటే ఇండోర్ వంటి ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఎదురవుతుంది. ఇప్పటికే వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుండగా, దీనికి జలకాలుష్యం తోడు కాకూడదు. సురక్షితమైన నీటిని, పారిశుద్ధ సౌకర్యాలను పొందడం మానవ హక్కుగా 2010లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కానీ నగరాల్లో సురక్షిత మంచినీటి సరఫరా ఒక సవాలుగా మారింది. వాడుకగా వచ్చే వ్యర్థ జలాల ప్రక్షాళన సరిగ్గా జరగకపోవడంతో అవి నేరుగా నదుల్లో కలిసి కలుషితం చేస్తున్నాయి. రెండు మూడేళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో కొన్నిప్రాంతాల్లో మురుగునీటిలో ఈకోలి బ్యాక్టీరియా విస్తరించి ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. ఈ కోలి బ్యాక్టీరియా అత్యధిక శాతం నిండి ఉన్న నీటిని తాగడం వల్లనే బెంగళూరు, కొచ్చి, నొయిడా, విజయనగరం నగరాల్లో కొన్నేళ్ల క్రితం ప్రజలు అస్వస్థులైన సంఘటనలు సంభవించాయి. మూడేళ్ల క్రితం చెన్నై లోని సబర్బన్ ప్రాంతం పల్లవరంలో పైపుల ద్వారా కలుషిత నీరు ప్రవహించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 34 మంది ఆస్పత్రి పాలయ్యారు.
అందుకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్టాలిన్ తమిళనాడు పదేళ్ల విజన్‌లో సురక్షితమైన నీటిసరఫరాకు ప్రాధాన్యం కల్పించారు. ఒడిశాలో 2017 2022 మధ్యకాలంలో 42 లక్షల మంది కలుషిత నీటితో డయేరియా, టైఫాయిడ్‌ల బారినపడ్డారు. ఆరుగురు మృతి చెందారు. అర్బన్, రూరల్ ఏరియాల్లో మురుగునీటి పారుదల సౌకర్యం లోపించడం, వ్యర్థ జలాల ప్రక్షాళన సరిగ్గా జరగకపోవడమే ఈ సమస్యలకు కారణమవుతోంది. దీంతోపాటు పరిశ్రమల కాలుష్యాలు, నీటి వనరులు నదుల్లోకి వచ్చి కలుస్తున్నాయి. కొన్ని నగరాల్లో కలుషిత జలాలతోనే కూరగాయల సాగు జరుగుతున్న సంఘటనలు కూడా ఉంటున్నాయి. జలశక్తి మంత్రిత్వశాఖ డేటా ప్రకారం దేశంలోని 25 రాష్ట్రాల్లోగల 230 జిల్లాల్లో భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, అలాగే 27 రాష్ట్రాల్లోని 469 జిల్లాల్లో ఫ్లోరైడ్ వంటి హానికరమైన మూలకాలు ఉన్నట్టు వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 1.7 బిలియన్ మంది మలమూత్రాల మయమైన నీటినే తాగుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 లో వెల్లడించడం గమనిస్తే ఇదెంత తీవ్రమైన సమస్యనో పాలకవర్గాలు పట్టించుకున్నప్పుడే ప్రజల ప్రాణాలకు భద్రత కలుగుతుంది.