Reading Time: 3 minutes

మహిళల వస్త్రధారణ గురించిన చర్చలు తరచుగా జరుగుతున్నవే. ఆ చర్చ ఇటీవల మరొకసారి జరుగుతున్నది. ఆ సందర్భంగా సహజంగానే భిన్నాభిప్రాయాలు వినవస్తున్నాయి. అటువంటి భిన్నత్వం మారుతున్న కాలానికి సంకేతం. అందువల్ల, ఏ విధమైన వస్త్రధారణ మంచిది, ఏది కాదు అనే ప్రశ్నలపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా, కొన్ని విషయాలను అర్థం చేసుకోవటం అవసరం. మహిళలు ఎటువంటి వస్త్రాలను, ఏ పద్ధతిలో ధరించాలి అనే ప్రశ్న సంప్రదాయిక సమాజంలో అసలు లేనే లేదు. అపుడు వ్యక్తిగత స్థాయిలో గాని, కుటుంబంలో భాగంగా కాని, సమాజంలో గాని స్త్రీ స్థానం, పాత్ర అందుకు అనుగుణమైన గౌరవమర్యాదలు, వస్త్రధారణలు అప్పటి సమాజానికి తగిన విధంగా ఉండేవి. అప్పటిది భూస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థ, అందుకు అనుగుణమైన కుటుంబ వ్యవస్థ. మహిళల స్థానం, పాత్ర, వస్త్రధారణ వంటివన్నీ కూడా అదే సంస్కృతి, సంప్రదాయం ప్రకారం ఉండేవి. ఆ వ్యవస్థలు, పాత్రలు అసలు సుస్థిర నాగరిక సమాజమన్నది వేల ఏళ్ల క్రితం ఏర్పడినప్పటి నుంచి మొదలై, ఆధునిక పారిశ్రామిక, నాగరిక వ్యవస్థల ప్రభావాలు విస్తరించటం వరకు కొనసాగాయి. అంతకుముందు వరకు అన్నీ స్థిరపడిపోయి, అదే విధంగా కొనసాగిన విషయాలే. నిజానికి స్త్రీల విషయంలోనే కాదు, పురుషులకు సంబంధించి కూడా అంతే.

ఇదంతా మారటం పాశ్చాత్య దేశాలలో పారిశ్రామికీకరణలు, ఆధునీకరణలతో, స్వేచ్ఛా భావనలు, హక్కులతో మొదలైంది. పాశ్చాత్య దేశాలు వనరులు, వాణిజ్యం, వలసలు ఏర్పాటు క్రమంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిన కొద్దీ అక్కడి సమాజాలపై పాశ్చాత్య సాంస్కృతిక ప్రభావాలు, అందులో భాగంగా వస్త్రధారణ ప్రభావాలు పడసాగాయి. అందుకు కొత్తచదువులు, వాటి ద్వారా లభించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పట్టణీకరణలు దోహదంచేసాయి. అయితే ఇందులో రెండు కోణాలున్నాయి. ఒకటి, పాశ్చాత్యుల సంస్కృతి, వస్త్రధారణ ఆకర్షణీయంగా తోచి, తమ భూస్వామ్య సంస్కృతీ బంధనాల నుంచి విముక్తి చెందటంగా అనిపించి, ఆ కొత్తదనాన్ని తమంత తాముగా అనుకరించటం. అటువంటి అనుకరణ మార్గంలో ఇంగ్లీషు విద్య కొత్త భావజాలలు, పట్టణీకరణల వంటివి కూడా సాధనాలుగా తోడ్పడటం. రెండవది, వలస పాలనా సంబంధాలవల్ల ఆర్థిక, వ్యాపారావసరాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొత్తవి ఏర్పడుతుండగా, అటువంటి కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఆధునిక వస్త్రధారణలు ఉపయోగకరం అయ్యాయి.

సౌలభ్యం కూడా అయ్యాయి. కాని ఈ పరివర్తన పురుషుల విషయంలోనే మొదట కనిపించాయి. బయటి వ్యవహారాలతో వారికి సంబంధం కారణంగా అట్లా జరిగింది. బాలికలు, యువతులు, స్త్రీలు ముఖ్యంగా సంస్కరణోద్యమ ప్రభావాలతో బయటకు రావటం, చదవటం, బయటి సమాజాన్ని, ప్రపంచాన్ని గమనించటం మొదలైంది. ఆ విధంగా స్వీయ స్పృహలు అంతకు ముందు కన్నా పెరగటమేగాక, వాటి వ్యక్తీకరణలు, స్వతంత్ర ఆలోచనలకు దారితీసాయి. అయినప్పటికీ వస్త్రధారణలు వెంటనే మారలేదు. కుటుంబం, సమాజం, సంస్కృతి, విద్య తీరు, విధి బాధ్యతలు, వివాహ వ్యవస్థలను బట్టి మహిళలు మరికొంత కాలం పాటు సంప్రదాయికంగా, కన్జర్వేటివ్‌గానే కొనసాగారు. వస్త్రధారణలు అందుకు అనుగుణంగా ఉండిపోయాయి. ఈ విషయంలో అంతకు మించిన మార్పులు వారి దైనందిన దృష్టికి అంతగా రాలేదు కూడా. మార్పులు మొదలైన తొలి రోజుల్లో , ఎవరైనా భుజాల వరకు కత్తిరింపులు గల జాకెట్లు వేసుకోవటమే ఆశ్చర్యాన్ని, కించిత్ భయాన్ని కలిగించిన విచిత్రం. అటువంటి దృశ్యాలు మొదట పరిచయమైంది సినిమాలలో, ఒకటీ అరా తెలుగు వారపత్రికల అడ్వర్టయిజ్‌మెంట్లలో. ఎవరైనా, ఎపుడైనా పెద్ద నగరాలకు వెళితే అక్కడ.

ఆ తర్వాతి దశ మార్పుకు కొన్ని కారణాలున్నాయి. పట్టణీకరణ, ఫ్యాషన్లు క్రమంగా పెరగటం. ఆడపిల్లలు గ్రామాలోని స్కూళ్ల స్థాయిని దాటి పట్టణాలో జానియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీ చదువుల స్థాయికి వెళుతుండటం. కొత్త తరం పిల్లలు, యువతులు గ్రామీణ వాతావరణం, సంస్కృతి, సంప్రదాయం, కన్జర్వేటిజం నుంచి క్రమంగా బయటపడుతుండటం, పూర్తిగా పట్టణవాసులైన వారితో స్నేహ సంబంధాల పెరుగుదల, వారు చూసే సినిమాలలో మరింత కొత్త పోకడలు, మేగజైన్లలో కొత్త డిజైన్లు, ఫ్యాషన్ల ప్రమోషన్, టేపమోషన్ షాపులలోనూ రెడీమేడ్ బట్టల షాపులలోనూ, బట్టల కంపెనీల అడ్వర్టయిజ్‌మెంట్లలోనూ కనిపించే కొత్తరకాల దుస్తులు, డిజైన్లు, అప్పటి యువతులు, స్త్రీలు చూసేందుకు సిగ్గుపడేవి విధంగా అంతకుముందెప్పుడూ లేని పద్ధతిలో లోదుస్తుల వ్యాపార ప్రకటనలు, వాటిని ధరించి కనపడే మోడల్స్, సినిమా తారలు ఇవన్నీ ఆ దశలో పెద్ద ప్రభావాలనే చూపాయి.

ఫ్యూడల్ గ్రామీణ సంప్రదాయిక సంస్కృతిలో అది స్లోమోషన్ విప్లవం వంటిది. ఆ ప్రభావాలు, ఆకర్షణలు గ్రామాలవైపు కూడా వ్యాపించ సాగాయి. మరికొంత కాలానికి అందుకు కొనసాగింపుగా యువతులు, విద్యార్ధినులు, ఉద్యోగినులు లంగా ఓణీ జాకెట్లకు బదులు జీన్స్, షర్టులు పంజాబీ డ్రస్సులు, స్కర్టులకు మారటం, కూడా చిన్నపాటి విప్లవమే అయింది. అది వారికి, తలిదండ్రులకు మధ్య వాగ్వాదాలకు, ఆంక్షలకు కూడా దారితీసింది. అక్కడక్కడ ఆ యువతులు, విద్యార్ధినులలో కొందరు ధైర్యంగా స్వతంత్రించి పెద్దలను ఎదిరించటం, నా బట్టలు నా ఇష్టం, నావళ్లు నా ఇష్టం అనటం వరకు పరిస్థితులు మారసాగాయి. వివాహితలకు భర్తలతో, అత్త వారితో సమస్య వచ్చాయి. ఇటువంటి వివిధ మార్పులు, వాటి దశలు స్థూలంగా 1947లో దేశ స్వాతంత్య్రం కన్న కొంత ముందు సంస్కరణోద్యమాల కాలం నుంచే మొదలై, స్వాతంత్య్రం తర్వాత క్రమంగా వేగాన్ని అందుకుంటూ, 20వ శతాబ్దం చివరి వరకు సాగినట్లు చెప్పవచ్చు. ఆసరికి వెనుకటి కన్జర్వేటివ్ సంస్కృతి, వ్యవస్థలు బలహీన పడుతుండటం, కాలక్రమంలో కొంతా, 1990ల నాటి ఆర్థిక సంస్కరణలు అభివృద్ధి ప్రభావాలతో కొంతగా జీవితాలు, జీవన దృక్పథాలు మారుతుండటంతో, ఆలోచనలులోనూ కొత్త దశ రాసాగింది. అదంతా మనుషులలోకి, సంస్కృతిలోకి మానవ సంబంధాలలోకి కుటుంబ సంబంధాలలోకి మార్కెటైజేషన్ అనే కొత్త ఎలిమెంట్‌ని అప్రకటితంగానే ప్రవేశపెట్టింది.

జీవితాలలో ఆర్థికావసరాలు పెరిగి, ఇతర అంశాల కన్న ఆర్థికం ముఖ్యమనే ఆలోచన కూడా పెరిగినపుడు, అన్నీ మార్కెటైజ్ అవుతుండటం ఒక తార్కికమైన పరిణామం. ఇక్కడ జాగ్రత్తగా గ్రహించవలసిన సూక్ష్మం ఒకటున్నది. ఈ విధమైన మార్కెటైజేషన్ క్రమంలో మనిషి తన కుటుంబంతో సంబంధాలో సహా అన్ని సంబంధాలను మార్కెటైజేషన్ దృష్టితో చూడటమే కాదు. స్వయంగా తనను కూడా అదే దృష్టితో చూసుకోవటం జరుగుతుంది. అనగా, తనకు తాను కాకుండా పోవటం (ఎలియెనీషన్) అన్న మాట. తన ఆలోచనను, అవసరాలను, వ్యవహరణను సంబంధాలను మార్కెట్ నియంత్రిస్తుంది. తను అన్నీ తనను మార్కెట్ చేసుకోవటం దృష్టితో చేస్తాడు, చేస్తుంది. స్వీయ వ్యాపారీకరణ జరిగినపుడు కనీసం కొందరి విషయంలో శరీర వ్యాపారీకరణ కూడా జరుగుతుంది. వస్త్రధారణలో మార్పులు ఇందులో భాగమవుతాయి. ఆ క్రమంలో భావజాలం, వస్త్రాలు, శరీరం, వ్యవహరణ, మాటలు, స్వేచ్ఛను సిద్ధాంతీకరించటం అన్నీ మార్కెటైజేషన్ సూత్రాలకు అనుగుణంగానే ఉంటాయి. వ్యాపార స్వేచ్ఛను లేదా స్వీయ విక్రయ స్వేచ్ఛను సాధారణ అర్థంలో వ్యక్తి స్వేచ్ఛగా చూపటం జరుగుతుంది.

నిజానికి ఆ స్వేచ్ఛ తనను తాను మార్కెటైజ్ చేసుకునే స్వేచ్ఛ అనే పరిధిలో కనిపిస్తుంది గాని, మానవ వికాసాన్ని, ప్రజాస్వామిక వికాసాన్ని ప్రతిఫలించే పరిధిలోకి రాదు. పైన అన్నట్లు అది తనకు తాను కాకుండాపోవటం, తననుతాను కోల్పోవటం, పరాయీకరణ చెందటం అవుతుంది. అట్లా కోల్పోవటమన్నది పలు రూపాలలో వ్యక్తమవుతుంది. సినిమాతో, దాని కథతో, సందర్భంతో నిమిత్తం లేకుండా బయట కూడా వ్యక్తమవుతుంది. వస్త్రధారణ, శరీర ప్రదర్శనల తీరు ఆ రూపాలలో ఒకటి. ఇందులో కొట్టవచ్చినట్లు కనిపించే ఒక విషయం ఏమంటే, ఈ నిర్ధిష్టమైన పద్ధతిలో తమను తాము ప్రదర్శించుకుని మార్కెటైజ్ చేసుకోవాలని మహిళల నుంచి మాత్రమే ఆశిస్తారు. అటువంటి వస్త్రధారణ వారి స్వేచ్ఛ అని చెప్పే స్వేచ్ఛావాదులైన పురుషులు రహస్యంగా ఆశించేది కూడా అదేననిపిస్తుంది. తిరిగి అక్కడ కనిపించేది పురుష స్వామ్యవ్యవస్థే. కొత్త ముసుగులో ఎవరైనా పురుషులు తమ కుటుంబ స్త్రీలకు అటువంటి స్వేచ్ఛ వారి హక్కు అని ప్రకటిస్తే, ఆ స్త్రీల మార్కెటైజేషన్ ద్వారా ప్రయోజనాలను రహస్యంగా ఆశించేందుకే. ఇక్కడ అంటున్నది, ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన తరహా స్వేచ్ఛల గురించి మాత్రమే. ఈ క్రమంలో స్వేచ్ఛ అన్నది దాని వాంఛనీయమైన, నిజమైన, స్త్రీవికాస సంబంధితమైన, ప్రజాస్వామిక హక్కుల సంబంధింతమైన అర్థాన్ని కోల్పోయి, ఒక కృత్రిమమైన, స్త్రీ తననుతాను కోల్పోయే, మార్కెటైజ్ అయే, మార్కెటైజేషన్ స్వేచ్ఛే నిజమైన స్వేచ్ఛగా భావించే థియరీగా వక్రీకృతమవుతున్నది.

– టంకశాల అశోక్( దూరదృష్టి)

రచయత సీనియర్ సంపాదకులు