
సహజ వనరులనేవి దేశ సంపదకు, అభివృద్ధికి నిలయంగా ఉంటాయి. వాటిని ప్రజల అవసరాల మేరకే ఉపయోగించాలి. మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం మాత్రం దేశ సహజ వనరులైన అడవులను, ఖనిజాలను, గనులను, నదులను చివరికి కొండలను కూడా దేశవిదేశీ బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది. అందులో భాగమే ఆరావళి కొండల్లో మైనింగ్ తవ్వకాలు. ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు, గిరిజనేతరులు, పర్యావరణ వేత్తలు సుదీర్ఘకాలం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఆరావళి కొండలకు ఇచ్చిన నిర్వచనానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆరావళి పశ్చిమ భారతదేశం లోని ఒక పర్వతశ్రేణి. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ మీదుగా ఈశాన్యంగా 8 వందల కిలోమీటర్ల మీద విస్తరించి ఉంది. ఇది గొప్ప భౌగోళిక చరిత్రకలిగి ప్రపంచంలోని పురాతన పర్వతశ్రేణుల్లో ఒకటి. వృక్షజాలం, జంతుజాలం, ముఖ్యమైన పర్యావరణ ప్రాంతంగా ఉంది. పాలరాయి, గ్రానైట్, మైకా, రాగి, జింక్, సీసం వంటి ఖనిజాలతో ఆరావళి నిండి ఉంది. ఈ పర్వతాలు పొరుగు ప్రాంతాలకు మంచినీరు అందిస్తాయి. వివిధ కొండలు, కోటలు, దేవాలయాలు, చారిత్రక నిర్మాణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పర్వతాలు థార్ ఎడారిలోని ఇసుక తుఫాన్లను అడ్డుకుంటాయి.
అక్రమ మైనింగ్: గత నాలుగు దశాబ్దాలుగా ఆరావళి కొండల్లో అక్రమ మైనింగ్‌తోపాటు అటవీ నిర్మూలన పెద్ద ఎత్తున జరుగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడా కంపెనీలకు అనుమతులు మంజూరు చేస్తున్నాయి. గతంలో అడవి గురించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిర్వచనం ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాలు మైనింగ్‌ని నిషేధిస్తే, కొన్ని రాష్ట్రాలు అనుమతించాయి. ఈ పరిస్థితి మైనింగ్ మాఫియాకు అనుకూలంగా మారింది. గురుగ్రా, ఫరీదాబాద్, నుహ్, మహేంద్ర గడ్ వంటి నగరాల మాస్టర్ ప్లాన్ కింద వాటిని ఆరావళి పరిధి నుంచి మినహాయించడానికి హర్యానా శాసనసభ 27-2-2019న భూసంరక్షణ చట్టాన్ని సవరించింది. దీనివల్ల ఆరావళి కొండల్లో దాదాపు 25 వేల హెక్టార్ల అటవీ ప్రాంతాలు మైనింగ్ కార్యకలాపాలకు వీలు కల్పించింది. అప్పటికే జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను కూడా చట్టబద్ధం చేసింది.
ఇటీవల మోడీ ప్రభుత్వం భూమట్టానికి 100 మీటర్ల లోపు కూడా ఆరావళి పర్వత శ్రేణులను మైనింగ్ లీజుకు ఇచ్చేందుకు నిబంధనలను సడలించింది. 1,47,000 చదరపు కిలోమీటర్లు ఉన్న ఆరావళి శ్రేణుల్లో కేవలం 2% మాత్రమే తవ్వకాలు జరుగుతాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేద్ర యాదవ్ చెబుతూ, మైనింగ్ తవ్వకాలను సమర్ధించుకున్నాడు. దీనిపై పర్యావరణవేత్తలు సుప్రీం కోర్టుకు వెళ్లగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, వంద మీటర్ల ఎత్తు లోపు ఉన్న కొండలను, కొండలుగా పరిగణించలేమని అక్కడ మైనింగ్ చేసుకోవచ్చని, మిగతా ప్రాంతంలో మైనింగ్ ని నిషేధించాలని నవంబర్ 2025న తీర్పు ఇచ్చింది. ఆరావళి పర్వత శ్రేణులపై కేంద్ర ప్రభుత్వ, సుప్రీం కోర్టుల నిర్వచనంపై దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేశారు. రాజస్థాన్‌లో జరిగిన వ్యతిరేక ఆందోళనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అనేక మంది మేధావులు, పర్యావరణ వేత్తలు తప్పుపట్టారు.
సుప్రీం కోర్టు తీర్పులు విచిత్రంగా ఉన్నాయి. ఒకసారి ఇచ్చిన తీర్పుకి భిన్నంగా, అదే అంశం మరో తీర్పు ఇవ్వడమే విచిత్రం. 2018లో చట్ట విరుద్ధమైన మైనింగ్‌ను ఆపాలని, అక్రమ మైనింగ్‌పై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మైనింగ్ ప్రాంతాలను సరిగా గుర్తించాలని, ఆరావళి ప్రాంతంలోని ప్రతి చిన్నరాయి, గుట్ట పర్వతం కిందకే వస్తుందని పేర్కొంది. అక్రమ మైనింగ్ వల్ల రాజస్థాన్, హర్యానాలో 31 కొండలు మాయమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025 మేలో కూడా మైనింగ్‌ని నిషేధించాలని చెప్పింది. అందుకు విరుద్ధంగా నవంబర్ 2025లో తీర్పు ఇచ్చింది. ఇలా పరస్పర విరుద్ధమైన తీర్పులు సుప్రీం కోర్టు నుండి వచ్చాయి. ప్రజా ఉద్యమ నేపథ్యంలో 2025 నవంబర్ లో తాను ఇచ్చిన తీర్పును ఉపసంహరించుకున్నట్లు తిరిగి సుప్రీం కోర్టు ప్రకటించి మైనింగ్ నిషేధించాలని పేర్కొంది. నెలలోనే రెండు విరుద్ధమైన తీర్పులు సుప్రీం కోర్టు నుంచి వెలువడ్డాయి.
ఆరావళిలో మైనింగ్ చేస్తున్న ముఖ్యమైన కంపెనీలు అరవాలి గ్రూప్, ఫ్యాబ్ స్టోన్, హిందూస్థాన్ జింక్, వేదాంత సంస్థలు కాకుండా ఇంకా అనేక పెద్ద, చిన్న కంపెనీలు ఉన్నాయి. అక్రమ మైనింగ్ ఫలితంగా పర్వతాల, అటవీ నిర్మూలనతోపాటు పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతుంది. చిన్న కొండలకు రక్షణ ఉండదు. గిరిజనుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. థార్ ఎడారి ఇసుక తుఫాన్లకు ప్రజలు గురవుతారు. ప్రజాఉద్యమం మూలంగా మోడీ ప్రభుత్వం మైనింగ్‌ని నిషేధించామని చెప్పినా, సుప్రీం కోర్టు తన తీర్పు ను ఉపసంహరించుకున్నా ఆరావళి పర్వతాలకు ప్రమాదం పొంచే ఉంది. బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే ముఖ్యమని భావించే మోడీ ప్రభుత్వం మైనింగ్ తవ్వకాలను ఆపుతుందని ఆశించలేం. సుదీర్ఘ ప్రజాఉద్యమమే మైనింగ్ తవ్వకాలను ఆపగలదు.
– బొల్లిముంత సాంబశివరావు
9885983526