Reading Time: < 1 minute

అమరావతి: కూతురు కాపురం చక్కదిద్దేందుకు వెళ్లి తల్లి తన కూతురు, మనవరాలితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ తల్లి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దుద్దుకూరుకు చెందిన విజయకుమారి, మండపేటకు చెందిన బూసాల విజయ్‌కుమార్‌ను ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్, కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఉన్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల గొడవలు జరుగుతున్నాయి. భార్యను భర్త వేధించడంతో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ విషయం విజయకుమారి తల్లి ధనలక్ష్మి(40)కి తెలియడంతో ఇద్దరికి సర్దిచెబుతామని తన కూతురు ఇంటికి వచ్చింది. అల్లుడి ఇంట్లో గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ధనలక్ష్మి తన కూతురు, మనవరాలితో కలిసి బయటకు వచ్చింది. ముగ్గురు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఆటోలో వంతెనపైకి వచ్చారు. అందరూ చూస్తుండగానే ధనలక్ష్మి గోదావరిలో దూకింది. విజయకుమారి తన కూతురుతో కలిసి దూకుతుండగా పక్కనున్న వారు వారిని పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని విజయకుమారి, కూతురును పిఎస్‌కు తీసుకెళ్లి భర్తకు సమాచారం ఇచ్చారు. ధనలక్ష్మి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చారు.