Reading Time: < 1 minute

లెజెండరీ యాక్టర్ తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అసుర సంహారం’. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో, శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీకృష్ణ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్స్, సాంగ్ లాంచింగ్ కార్యక్రమం తనికెళ్ల భరణి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సుమారు 750కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన తనికెళ్ల భరణి, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన ‘విలేజ్ క్రైమ్ డ్రామా’గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో తనికెళ్ల భరణితో పాటు మిధున ప్రియ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘అసుర సంహారం అంటే చెడుపై మంచి సాధించిన విజయం. డైరెక్టర్ కిషోర్ శ్రీకృష్ణ మంచి సబ్జెక్టను తెరకెక్కించారు. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఒక విలేజ్ లో డిటెక్టివ్ పాత్ర పోషించాను‘ అని చెప్పారు. దర్శకుడు కిషోర్ శ్రీకృష్ణ మాట్లాడుతూ.. తనికెళ్ల భరణి ఇందులో విలేజ్ డిటెక్టివ్‌గా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా మారుతుందనే నమ్మకం ఉంది‘ అని తెలిపారు.