Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయికాట్ చేయాలని బిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఉప శాసనసభాపక్షనేత హరీ శ్‌రావు వెల్లడించారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప క్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలు శుక్రవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసి, ఎంఎల్‌ఎల ప్రవేశద్వా రం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం సేవ్ డెమోక్రసీ, ఇది అసెంబ్లీనా..సిఎల్‌పి మీటింగా? అంటూ నినాదాలు చేస్తూ కాలినడకన గన్‌పార్క్ వద్దకు చేరుకుని అక్కడ బైఠాయించి నిరసనకు దిగారు. అనంతంర హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ, సభలో అందరికీ సమాన హక్కు లు కల్పించాల్సిన స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ తీరుకు, ప్రభు త్వ అహంకారపూరిత వైఖరికి నిరసనగా ఈ అ సెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.బిఎసి సమావేశానికి తమను గంటన్నర సమయం నిరీక్షించజేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభను ఏడు రోజుల 

పాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నామని..కానీ, సభలో ప్రవేశపెట్టిన మినిట్స్‌లో మాత్రం సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నామని తప్పుడు సమాచారం పొందుపరిచారని పేర్కొన్నారు. స్పీకర్ సభను కస్టోడియన్‌లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారని ఆరోపించారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, క్వశ్చన్ అవర్‌లో 10 ప్రశ్నలు ఉంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తమ మైక్ కట్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ విమర్శించలేదా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాము సిఎంను ప్రశ్నిస్తే మైక్ ఎందుకు ఆపేస్తున్నారని అడిగారు. ముఖ్యమంత్రిని విమర్శించవద్దని స్పీకర్ తమకు రూల్స్ చెప్పడం ఎక్కడి పద్ధతి అని.. ప్రతిపక్షం మాట్లాడకూడదంటే అసలు సభ ఎందుకు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

మూసీ కంటే సిఎం మాటల కంపు ఎక్కువైపోయింది

మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల కంపు ఎక్కువైపోయిందని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు సిఎం నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సభలో సిఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారని, ఒక ముఖ్యమంత్రిలా కాకుండా వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని సిఎల్‌పి మీటింగ్‌లా, గాంధీ భవన్‌లా మార్చేశారని ఆరోపించారు. సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట మాట్లాడినట్లే సొల్లు వాగుడు వాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు, పదేళ్లు సిఎంగా చేసిన కెసిఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌పై సిఎం వాడిన భాషను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి..అసలైన తెలంగాణ ద్రోహి, తెలంగాణ నీటి ద్రోహి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మూసీపై చర్చకు తాము సిద్ధం అని, అయితే అయితే స్వల్పకాలిక చర్చ పెట్టాలని, రోజంతా చర్చిద్దామని అన్నారు. కానీ, క్వశ్చన్ అవర్‌లో సిఎం వచ్చి గంటన్నర సేపు అడ్డగోలుగా మాట్లాడితే ఎలా..? అని ప్రశ్నించారు.

మూసీ ప్రక్షాళనకు గోదావరి జలాలను మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా..? అని అడిగాము అని, దానికి సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. మూసీలో ఇళ్లు కోల్పోయిన పేదలకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని కోరామన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ శుద్ధి కోసం గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం 32 ఎస్‌టిపిలను కట్టిందని, మరో 39 ఎస్‌టిపిల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, అది తమ చిత్తశుద్ధి అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ దేశంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. ఇక్కడ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. అవినీతికి అధికారికంగా రేట్లు పెట్టి మరీ పెంచిన రేవంత్ రెడ్డికి తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు.