
మన తెలంగాణ/హైదరాబాద్: కొందరు కడుపులో విషం తగ్గించుకుంటే మంచిద ని విపక్ష పార్టీలోని పలువురు కీలక నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి హితవు పలికారు. మూసీ కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషం అత్యంత ప్ర మాదకరమన్నారు. తాను వివరాలు చె బుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ విపక్ష సభ్యులను ఆయన సూటి గా నిలదీశారు. ప్రజలకు నిజాలు తెలియవద్దని చర్చ జరగకుండా చూడాలనుకుంటున్నారా? అని వారిని ప్రశ్నించా రు. వివరాలు చెబుతుంటే నొప్పి ఎందు కు మీకు అంటూ విపక్ష సభ్యులపై ఆయన మండిపడ్డారు. శుక్రవారం శాసనసభలో మూసీ పునరుజ్జీవం అంశంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా ముఖ్యమంత్రి కలుగచేసుకుని, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన విస్తృత లక్ష్యాలు, ఉద్దేశాలను సభ్యులకు వివరించారు. మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారని వారిని సీఎం రేవంత్ రెడ్డి కడిగేశారు.
కొంతమంది తనను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారని, రియల్ ఎస్టేట్ సైతం ఒక ఇండస్ట్రీనే అని ఆయన వివరించారు. హైటెక్ సిటీ నిర్మించాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారని పేర్కొన్నారు. రోజు రోజుకు పట్టణీకరణ పెరుగుతుందని చెప్పారు. రాబోయే 20 ఏళ్లలో 75 శాతానికి పట్టణీకరణ పెరుగుతుందని తెలిపారు. తెలంగాణలో మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని, అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం ఉందన్నారు. మూసీ, ఈసీ నదులు కలిసే చోట బాపు ఘాట్ నిర్మించారని, అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టామని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. జలవనరులను కలుషితం చేసి కబ్జాలు పెట్టి ఫాంహౌస్‌లు నిర్మించారని వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారని మండిపడ్డారు. అందుకే ఆ డ్రైనేజీలను కూలగొట్టి కబ్జాలపై చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మమ్మల్ని బద్నాం చేసేందుకు రూ.లక్షల కోట్లు ఖర్చు
వికారాబాద్ అడవుల్లో వనమూలికలను నిజాం పెంచారని, కానీ నగర శివారులో కొందరు ఫాంహౌస్లు కట్టి డ్రైనేజీలు తీసుకెళ్లి గండిపేటలో కలిపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ముగ్గురు నీరంతా తీసుకెళ్లి మూసీలో కలిపారని, నేడు నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా నివాసయోగ్యం కాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఫాంహౌస్‌లపై కఠిన చర్యలు తీసుకున్నామని, కానీ కొందరు పనిగట్టుకుని మాపై సోషల్ మీడియా లో రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి బద్నాం చేశారని ఆరోపించారు. గుజరాత్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే అక్కడ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టారని, అక్కడి నుంచి 60 వేల కుటుంబాలను కూడా తరలించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. యూపీలో గంగానది ప్రక్షాళనకు వేలాది మందిని తరలించారని, ఢిల్లీలో యమునాను ప్రక్షాళన చేస్తామంటేనే బీజేపీ వాళ్లు గెలిచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మూసీ మురుగుతో నల్గొండకు శిక్ష
మూసీ మురుగు శిక్షను నల్గొండ ప్రజలు అనుభవిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఫ్లోరైడ్‌తో ఆ జిల్లా ప్రజలకు దేవుడు శిక్ష వేశారని సభలో ప్రస్తావించారు. మూసీ నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలకు గుదిబండలా మారాయని పేర్కొన్నారు. అక్కడి మూసీ పరివాహకంలో నీళ్లు తాగితే పిల్లలు పుట్టని పరిస్థితి ఉందన్నారు. చివరికి పంటలు పండించలేని దుస్థితి దాపురించిందని తెలిపారు. మూసీ ప్రక్షాళన కావాలా.. వద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ సభ్యలను అసెంబ్లీలో ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనపై బీఆర్‌ఎస్ పార్టీ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాలని కోరారు. మూసీలో ఉండే కాలుష్యం కంటే కొంతమంది కడుపులో విషం ఎక్కువ ఉందని, తాము మూసీ ప్రక్షాళనపై వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే విషం కక్కుతున్నారని విపక్ష సభ్యులకు చురకలంటించారు. ప్రజలకు ప్రభుత్వం చేసేది తెలియొద్దు అనేది వాళ్లు ఉద్దేశమని మండిపడ్డారు. అవతలి వాళ్లు మాడిపోయేలా కొందరి చూపులు ఉన్నాయని, అసలు మూసీ ప్రక్షాళన కావాలా.. వద్దా? అని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు.
21 కిలోమీటర్లు మూసీ నది ప్రక్షాళన
మూసీ నది ప్రక్షాళనను మొదట 21 కిలోమీటర్లు చేయాలని చూస్తున్నామని, హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేస్తామని చెప్పారు. మార్చిలో తొలి దశ పనులు ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతిలోగా తొలి దశ డీపీఆర్‌పై క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 51 కి.మీ మూసీ అభివృద్ధి చేస్తామని వివరించారు. 51 కి.మీ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామన్నారు. మీరాలం ట్యాంక్ కూడా మూసీ అభివృద్ధిలో భాగమేనని స్పష్టం చేశారు. ఈ ట్యాంక్‌పై రూ.450 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. గతంలో గుజరాత్‌లో సబర్మతి నది అభివృద్ధి కోసం 60 వేల కుటుంబాలను మరో ప్రాంతానికి తరలించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. యూపీలో గంగా నది ప్రక్షాళన చేసి రివర్‌ఫ్రంట్ ఏర్పాటు చేశారన్నారు. నది పరివాహక ప్రాంతాల అభివృద్ధిని బీజేపీ ఎన్నికల అజెండాగా మర్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను వ్యతిరేకించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నదులు కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా చేశారని మండిపడ్డారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వాసితులకు ప్రత్యామ్నాయం కోరామని చెప్పారు.
ఏడాదంతా నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు
మూసీ నది కలుషితం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని సిఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటి నుంచి కాపాడాలని వేలాదిగా విజ్ఞప్తులు వచ్చాయని, ఏడాదంతా మూసీలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామన్నారు. 3 సంస్థల జాయించ్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ చేపడుతున్నట్లు వివరించారు. గోదావరి నుంచి 20 టీఎంసీలు నగరానికి తరలించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. నగరం దాహార్తి తీర్చేందుకు 15 టీఎంసీలు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మరో 5 టీఎంసీలు గండిపేటకు తరలించాలని యోచన తమ ప్రభుత్వానికి ఉందని వివరించారు. మూసీ పరివాహాక ప్రాంతంలో ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చి నిర్మిస్తామని తెలిపారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని స్పష్టం చేశారు. వచ్చే మూడు నెలల్లో అంచనాలు ఫైనల్ చేస్తామని ప్రకటించారు. ఏడీబీ బ్యాంకు రూ.4,100 కోట్ల రుణం ఇస్తుందన్నారు. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పాలని సూచించారు. పేదలకు మంచి ఇళ్లు కట్టించి వారికి మెరుగైన వసతులు కల్పిద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే తమ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు. తాము మంచి పని చేయాలనుకుంటున్నామని, మీ సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. డీపీఆర్ సిద్దమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి సలహాలు తీసుకుంటామని గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేస్తాం
మార్చి 31లోగా అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలిచి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అభివృద్ధి పనులు ప్రారంభించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి మూసీ నది పునరుజ్జీవం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన నగరాలను అధ్యయనం చేసిన అనంతరం, మూసీలో శుద్ధమైన నీరు ప్రవహించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా నదీ పరివాహక ప్రాంతాల్లోనే మానవ నాగరికత అభివృద్ధి చెందిందని, హైదరాబాద్‌కు సంబంధించి నిజాం హయాంలోనే మూసీ తీరం వెంబడి గొప్ప అభివృద్ధి జరిగిందని గుర్తుచేశారు. 1908 వరదల అనంతరం హైదరాబాద్ నగరానికి శాశ్వత పరిష్కారంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు నిర్మించారని చెప్పారు. మూసీ నది కాలుష్యం వల్ల పరివాహక ప్రాంతాల్లో పర్యావరణం, ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని, పరిశ్రమల మలినాలు, ఘన వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం కన్సల్టెన్సీలను నియమించి డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. బాపూ ఘాట్ వద్ద మూసా – ఈసా నదుల సంగమంలో ప్రపంచంలోనే ఎత్తైన మహాత్ముడి విగ్రహాన్ని నెలకొల్పే ప్రాంతం గాంధీ సరోవర్‌ను ‘వి’ ఆకారంలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
ఎడిబి బ్యాంకు నుంచి రూ. 4 వేల కోట్ల రుణం
ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు 4 వేల కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అవసరమైన అనుమతులు లభించాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కూడా ప్రణాళికలో ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలకు మెరుగైన నివాసాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఓల్డ్ సిటీ సహా నగరంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంచి రేవుల సమీపంలో ఉన్న పురాతన శివాలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, మూసీ తీరం వెంబడి వివిధ ప్రాంతాల్లో గురుద్వారా, మసీదు, చర్చి నిర్మాణాల ద్వారా మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాత శాసనసభ ముందు పెడతామని, దానిపై ప్రజాప్రతినిధులు, నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళతామని చెప్పారు. హైదరాబాద్‌ను పర్యావరణ అనుకూలంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.