Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. అందులో భాగంగా ఫిబ్రవరి మొదటివారం నుం చి సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన మొదలుకానుంది. ఈ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 3న జడ్చర్ల నుంచి సిఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే అదే రోజు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ఈ పర్యటన ముఖ్య లక్ష్యమని కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. వారంరోజుల పాటు సిఎం రేవంత్‌రెడ్డి పలు జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలకు సిఎం రేవంత్ శ్రీకారం చుడతారని సమాచారం.

దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన పోరపా ట్లు మరోసారి జరగకుండా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేలా సిఎం రేవంత్‌రెడ్డి ప్రణాళికలు రూ పొందించినట్టుగా తెలిసింది. గ్రూపు పంచాయితీలకు తావివ్వకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సిఎం రేవంత్‌రెడ్డి తన పర్యటనలో దిశానిర్ధే శం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపా యి. ఫిబ్రవరి రెండోవారంలో మున్సిపల్ ఎన్నిక లు జరిగే అవకాశం ఉండడంతో ఆ దిశగా ఎన్నికలకు కాంగ్రెస్  సిద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దీనికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. 2025, డిసెంబర్ 29వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 1, 2026న ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసింది. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత జనవరి 10న తుది ఓటర్ల జాబితా ప్రచురించనుంది.