Reading Time: 2 minutes

మన తెలంగాణ/చర్ల: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా అతని భార్య రాజి తో సహా పలువురు నాయకుల మృతికి భద్రాద్రి కొ త్తగూడెం జిల్లా, చర్ల మండలంలోని అధికార పార్టీ కి చెందిన ఒక నాయకుడితో పాటు కొంతమంది కాంటాక్టర్లు కారకులని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమి టీ విప్లవ పేరిట శుక్రవారం విడుదల చేసిన లేఖలో ఆరోపించారు. చికిత్స కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్తామని చెప్పి మోసగించిన కాంట్రాక్టర్ ఎవరో తమ విచారణలో తేలిందని, ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డ్ మాటలు తమ దగ్గర ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర, సుక్మా జిల్లా డోకుపాడు నుండి తెలంగాణ రాష్ట్రం, చర్ల మండలం, కొండవాయి మార్గమధ్యలో వాహనం ఉంచి కాంట్రాక్టర్ సహాయకుడిగా ఉన్న ఈ ద్రోహి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు తీసుకుని వెళ్లి శత్రువుకి అప్పగించినట్లు లేఖలో ఆరోపించారు. తమ కామ్రేడ్స్ మృతికి కారణమైన వీరిని వదిలిపెట్టమని ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ‘నీకు ప్రాణభిక్ష పెడితే.. నువ్వు మా మా కామ్రేడ్స్‌ని చంపిస్తావా, నీకు మా చేతిలో మరణశిక్ష తప్పదు’ అంటూ 

తీవ్ర పదజాలంతో హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల తమ పార్టీ హతమార్చిన కాంట్రాక్టర్ పార్టీని మోసగించి ద్రోహం చేశాడని, ఈ విషయం అతడే స్వయంగా ఒప్పుకున్నందుని ప్రజా కోర్టులో శిక్ష వేశామని తెలిపారు. తమ దృష్టిలో ఇంకా కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారని, వారికి కూడా త్వరలో శిక్ష తప్పదని లేఖలో హెచ్చరించారు. ‘అడవిలోకి వెళ్లం, తప్పించుకున్నాం అనే భ్రమలో బతుకుతున్నారని, కానీ తమ పార్టీ కామ్రేడ్స్ మీతోనే మీ మధ్యలోనే ఉన్నారని, మీకు మీ దగ్గరే శిక్ష వేస్తాం’ అని పేర్కొన్నారు. పోలీసు బలగాలను అడవులకు పంపడం కాదు, మీరు పరిపాలించే ప్రజలకు నష్టం కలిగించకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ‘గత ఏడాది డిసెంబర్ 19న భద్రాచలంలో బహిరంగ ప్రదేశంలో ప్రజలు చూస్తుండగా జరిగిన హత్య మీ ఇలాకాలో జరిగింది కాదా, ఇది మీ పరిపాలన’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. విప్లవం కోసం ప్రాణాలర్పించిన ప్రతి కామ్రేడ్ కి విప్లవ జోహార్లు అంటూ పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ నాయకులపై జరుగుతున్న హత్యాకాండని ఎన్‌కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారని, భాజపా ప్రభుత్వాన్ని విధానాలను ఖండించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం పని చేసే మావోయిస్ట్ పార్టీకి ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు, జర్నలిస్టులు, పౌరహక్కులు, మానవ హక్కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు మద్దతు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.