
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్‌పై కాషాయ, బిజెపి నేతల ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి. షారూక్ దేశ విద్రోహి అని, తన ఐపిఎల్ టీంలో బంగ్లాదేశీ క్రికెట్ ఆటగాడిని తీసుకుని దేశానికి చేటు చేశాడని బిజెపి సీనియర్ నేత , పార్టీ వివాదాస్పద ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మండిపడ్డారు. ఇప్పుడు కాషాయ నేత మీరా ఠాకూర్ పలుచోట్ల షారూక్ పోస్టర్ల చింపివేతకు దిగారు. పైగా షారూక్ నాలుక కోసి తీసుకువచ్చిన వారికి రూ 1 లక్ష పారితోషికం ఇస్తానని ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో హిదువులను ఊచకోతకు గురిచేస్తున్నారు. దీనిని పట్టించుకోకుండా ఈ హీరో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపిఎల్ టీం కోసం కాంట్రాక్టుకు కుదుర్కుకుంటారా? అని నిలదీశారు. మీరా ఠాకూర్ ఆగ్రా జిల్లా హిందూ మహాసభ అధ్యక్షురాలుగా ఉన్నారు. హిందూ సోదరులను బంగ్లాదేశ్‌లో తగులబెడుతూ ఉంటే ,
అక్కడి ఆటగాళ్లను షారూక్ నెత్తికి ఎక్కించుకుంటారా? పైగా వాదనకు దిగుతారా? ఈ మూర్ఖుడి నాలుక కత్తిరించి తెస్తే ఎవరికైనా లక్ష ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇతర ప్రాంతాలకు చెందిన సాధువులు షారూక్ నిర్ణయం పట్ల తీవ్ర నిరసనకు దిగారు. మొత్తం మీద నిర్ణయం తీసుకునేది బిసిసిఐ . అయితే ఇక్కడికి రావాలనుకునే బంగ్లాదేశ్ క్రికెటర్లు ముందుగా తమ దేశంలో హిదువుల భద్రత గురించి స్పందించాల్సి ఉందని ప్రముఖ హరికథకుడు ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. పలు ఇతర హిందూ సంస్థల నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం అయింది. షారూక్ ఓ హీరోనా , ఆయనకు వ్యక్తిత్వం లేదని ప్రముఖ సాధువు స్వామి రామ్‌భద్రాచార్య స్పందించారు. ఖాన్ ఆస్తులను స్వాధీనపర్చుకోవాలి. ఆయననే వెంటనే బంగ్లాదేశ్‌కు పంపించాలని కోరుతూ ప్రధాని మోడీకి మరో సాధువు దినేష్ ఫలాహరి మహారాజు ఓ లేఖ పంపించారు.