Reading Time: < 1 minute

 ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఉస్మాన్ ఖ్వాజా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొంతకాలంగా ఖ్యాజా క్రికెట్ నుంచి తప్పుకుంటాడనే వార్తలు వినవచ్చాయి. దీన్ని నిజం చేస్తు ఖ్వాజా క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు తర్వాత ఖ్వాజా క్రికెట్ నుంచి తప్పుకోనున్నాడు. ఈ విషయాన్ని ఖ్వాజా శుక్రవారం వెల్లడించాడు. ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని, ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా జట్టులో కొనసాగడం తనకు సాధ్యం కాదని ఖ్వాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుదీర్ఘ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న జాతి వివక్ష గురించి వివరించాడు. ఆస్ట్రేలియా జట్టులో ప్రయాణం సాఫీగా సాగలేదన్నాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొవాల్సి వచ్చిందన్నాడు. నల్లజాతి క్రికెటర్ కావడంతో సహచర ఆటగాళ్ల నుంచి కోచ్‌ల నుంచి చివరికి మీడియా నుంచి కూడా అవమానులు ఎదుర్కొక తప్పలేదన్నాడు. అయినా తాను చాలా రోజుల పాటు ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లో కొనసాగడం గర్వంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లో తనకు చోటు దక్కదని, ఎప్పుడూ జట్టు తరఫున ఆడలేవని కొంతమంది బహిరంగంగానే ఛాలెంజ్ చేశారన్నాడు.

అయితే తాను మాత్రం వారి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగనని వెల్లడించాడు. అంతేగాక మూడు ఫార్మాట్‌లలోనూ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించానని వివరించాడు. జట్టులోని పలువురు ఆటగాళ్లు నాతో ఎప్పుడూ వివక్షపూరితంగానే వ్యవహరించారన్నాడు. అయినా తాను వాటిని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవాడినని తెలిపాడు. ఎన్ని అవమానాలు ఎదురైనా సుదీర్ఘ రోజుల పాటు ఆస్ట్రేలియా టీమ్‌లో కొనసాగి విమర్శకులకు గట్టి సమాధానమే చెప్పానని ఖ్వాజా పేర్కొన్నాడు. కాగా, ఖ్వాజా అంతర్జాతీయ కెరీర్‌లో ఆస్ట్రేలియా తరఫున 87 టెస్టులు, 40 వన్డేలు, 9 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో 8,001 పరుగులనుసాధించాడు. 2025లో 18 ఇన్నింగ్స్‌లలో 614 పరుగులు చేశాడు. అంతేగాక 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.