Reading Time: < 1 minute

నగరం లోని భగీరథపుర ప్రాంతంలో నీటి కాలుష్యంతో డయేరియా వ్యాపించి 10 మంది మృతి చెందారని ఇండోర్ మేయర్ పుష్యమిత్ర భార్గవ శుక్రవారం వెల్లడించారు. అయితే స్థానికులు మాత్రం డయేరియా వల్ల ఒక పసికందుతోసహా మొత్తం 14 మంది చనిపోయారని చెబుతుండగా, ఆరోగ్య విభాగం దాన్ని ధ్రువీకరించడం లేదు. ఆరోగ్య విభాగం డేటా ప్రకారం భగీరథపుర లో డయేరియా వల్ల నలుగురు మృతి చెందారని వెల్లడైంది. అయితే డయేరియా వ్యాపించి మొత్తం పదిమంది చనిపోయారని సమాచారం అందినట్టు భార్గవ పేర్కొన్నారు. భగీరథపురలో తాగునీటి నమూనాల ప్రాథమిక పరీక్ష ప్రకారం కలరా వ్యాపించిందన్న అనుమానం కలుగుతోందా అన్నప్రశ్నకు ఈ సమాచారం ఆరోగ్య విభాగం మాత్రమే తెలియజేస్తుందని భార్గవ చెప్పారు.

చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాధవ్ ప్రసాద్ హసనీ సిటీ మెడికల్ కాలేజీలోని ల్యాబొరేటరీ పరీక్షల్లో స్థానికంగా పైపు లైన్ లీకేజీ కారణంగా తాగునీరు కలుషితం అయిందని గురువారం వెల్లడించారు. అయితే ఆయన సవివరంగా సమాచారం ఇవ్వడంలేదు. భగీరథపుర లోని పోలీస్ స్టేషన్ సమీపాన ప్రధాన మంచినీటి పైపులైన్ లీకేజీ అయిందని, ఆ ప్రదేశం లోనే మరుగుదొడ్డి నిర్మించి ఉండడంతో నీరు కలుషితమైందని అధికారులు చెప్పారు. భగీరథపురలో గత తొమ్మిది రోజులుగా 1400 మంది కన్నా ఎక్కువ మంది వాంతులు, డయేరియాతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి వరకు 272 మంది ఆస్పత్రిలో చేరగా, వీరిలో 71 మంది డిశ్చార్జి అయ్యారని ఆరోగ్య విభాగం అధికారులు వివరించారు. 201 మంది రోగుల్లో 32 మంది ఆస్పత్రి లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో చికిత్స పొందుతున్నారు.