Reading Time: < 1 minute

 హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల ప్రభుత్వడిగ్రీ కాలేజీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ర్యాగింగ్, లైంగికవేధింపులకు బలైపోయింది. మానసికంగా వేదనకు గురై, దాదాపు రెండు నెలల పాటు మృత్యువుతోపోరాడి , చివరకు ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనలో కాలేజీ ప్రొఫెసర్‌తోపాటు ముగ్గురు యవతులు ర్యాగింగ్, లైంగిక వేధింపుల కారణంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 26న మరణించింది. . విద్యార్థిని మృతికి కారణమైన లెక్చరర్‌తోపాటు ముగ్గురు విద్యార్థినులపై తాజాగా ధర్మశాల పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 75, 115(2),మరియు 3(5) కింద, అలాగే హిమాచల్ ప్రదేశ్ విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిషేధ చట్టం లోని సెక్షన్ 3 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి తండ్రి పోలీసుల ఫిర్యాదులో వివరాల ప్రకారం ధర్మశాల లోని ప్రభుత్వ కాలేజీలో పల్లవి అనే 19 ఏళ్ల యువతి డిగ్రీ చదువుతుంది. గత ఏడాది సెప్టెంబర్ 18 న ఆమెపై అదే కాలేజీలోని లెక్చరర్‌తోపాటు ముగ్గురు తోటి విద్యార్థినులు ర్యాగింగ్, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తన కుమార్తెపై శారీరకంగా, దాడి చేసి బెదిరించారని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు.

కళాశాలలో ఒక ప్రొఫెసర్ తమ కుమార్తె పట్ల అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. వారి వేధింపులు, బెదిరింపుల కారణంగా తన కుమార్తె భయపడి మానసికంగా కుంగిపోయిందని, దానివల్ల ఆమె ఆరోగ్యం క్షీణించిందని పోలీసులకు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో హిమాచల్ లోని వివిధ ఆస్పత్రుల్లో ఆమెకు చికిత్స అందించినట్టు ఆయన చెప్పారు. ఆ తరువాత ఆమెను లూథియానా లోని దయానంద్ మెడికల్ కాలేజీ, ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పల్లవి 2025 డిసెంబర్ 26 న మరణించింది. తన కుమార్తె చాలా కాలంపాటు తీవ్ర అనారోగ్యంతో , మానసిక వేదనతో ఉన్నందున తాను ఈ విషయాన్ని ఇంతకు ముందు పోలీసులకు ఫిర్యాదు చేయలేక పోయానని మృతురాలి తండ్రి వివరించారు. ఆమె మరణంతో కుటుంబం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని, అందుకే ఫిర్యాదు చేయడంలో ఆలస్యం జరిగిందని ఆయన వెల్లడించారు. దీనిపై విచారణ జరిపిన తరువాత నిందితులు ముగ్గురు విద్యార్థులు, లెక్చరర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.