
దేశంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, ధరల పెరుగుదలకు నిరసనగా ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. ఇరాన్ రాజధాని తెహ్రాన్ లో మొదలైన నిరసనలు పలు ప్రాంతాలకు పాకాయి. ఆదివారం నుంచి ఇరాన్ లో కొనసాగుతున్న నిరసనలను భద్రతాదళాలు నిరోధించడానికి యత్నించడంతో జరిగిన ఘర్షణల్లో ఏడుగురు మరణించారు. మంగళవారం నాడు దాదాపు పది యూనివర్సిటీల విద్యార్థులు నిరసనలలో పాల్గొనడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది.రోజుల తరబడి నిరసనల కారణంగా చాలా ఇరానియన్ యూనివర్సిటీలు, దుకాణాలు, వ్యాపారాలు మూతబడ్డాయి. కీలకమైన మార్కెట్లు బంద్ అయ్యాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, దిగజారిన కరెన్సీ , ధరల పెరుగుదల, ఆందళన కల్గిస్తున్న ఆర్థిక పరిస్థితికి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలోనే ద్రవ్యోల్బణం 42.5 శాతం పెరిగింది. నిరసనలలో దుకాణాల యజమానులే కీలక పాత్ర వహిస్తున్నారు.
నిరసన కారులు ఒక దశలో హింసాత్మకంగా మారి రాళ్లు రువ్వడంతో చాలా భవనాలు దెబ్బతిన్నాయని ఇరాన్ వార్తా సంస్థ పేర్కొంది.ఇరాన్ అణు కార్యక్రమం పై అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర వత్తిడికి లోనయింది. జూన్ లో ఇజ్రాయెల్ తో 12 రోజుల యుద్ధం తర్వాత ప్రాంతీయపరమైన ఉద్రిక్తతలు హెచ్చి, ఆర్థిక పరిస్థితి మరీ దిగజారింది. ఆర్థిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో ఆందోళనలు మొదలైనా, నిరసనకారులు ప్రభుత్వానికి , అధినేతకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం.2022లో ఇరాన్ లో మహిళల హిజాబ్ వివాదం, మహ్సా అమిని కస్టడీలో మరణం తర్వాత వెల్లువెత్తిన నిరసనల తర్వాత వందలాది మంది మరణించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇరాన్ లో ఇదే ప్రథమం.