
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించకపోతే ప్రతిపక్షం ఎక్కడన్నా పాలకపక్షానికి డబ్బా కొడుతుందా? అని బిఆర్ఎస్ ఎంఎల్ఎ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వకపోవడం ఏంటి అని స్పీకర్ ను ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని పొగడడానికి అసెంబ్లీకి వస్తారా? అని చురకలంటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ కంపు అంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా అసెంబ్లీలో వదిలారని దుయ్యబట్టారు.
ప్రాధానమైన ప్రతిపక్షంగా తాము ప్రజల తరుపున ప్రశ్నలు అడిగి తీరుతామని, తాము పేద ప్రజల ఇల్లు కూల గొడితే బాధితుల వెంట ఉంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు దాడి చేసి మాకు అవకాశం ఇవ్వకుండా వేరే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారని విమర్శించారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎ సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మూసీ ప్రస్తావన తీసుకురాగానే వారి మైక్ కట్ చేశారని మండిపడ్డారు. స్పీకర్ వైఖరికి నిరసనగా తాము సభను బాయ్ కాట్ చేశామని జగదీశ్ రెడ్డి తెలిపారు. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా శాసన సభ శీతాకాల సమావేశాలను బిఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది.