
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉమ్మడి పాలకుల కంటే మాజీ సీ ఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావే తెలంగాణకు ఎక్కువ అన్యా యం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వీరిద్దరు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే దుర్మార్గులు అని, వారిని ఉరి వే సినా తప్పులేదని అన్నారు. అదే మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే వీళ్లను రాళ్లతో కొట్టి చంపేవారని గుర్తు చేసారు. సాగునీటి ప్రాజెక్టులపై శా సనసభలో చర్చ సందర్భంగా మంత్రులు ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లకు అవగాహన కల్పిస్తూ ప్రజాభవన్‌లో గురువారం సాయంత్రం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా సభలో చర్చించేందుకు కెసిఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేసారు. సభలో కేసీఆర్ హక్కులకు, గౌరవానికి ఎలాంటి భంగం కలగదని అది తన పూచీ అని సీఎం హామీ ఇచ్చారు. కెసిఆర్ సభకు వచ్చి మాట్లాడితే ఆయన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు. తెలంగాణకు ఆంధ్రకు మధ్య జల వివాదాలు సృష్టించి దాని ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలని కెసిఆర్ చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల కమిషన్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తేలాలన్నారు.
ప్రధానంగా నీటి హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, గత పదేళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుని ఉంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేదన్నారు. నీళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పిజెఆర్ స్వంత ప్రభుత్వాన్ని సైతం నిలదీశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయని, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చకు పెడుతున్నామన్నారు. కానీ గతబిఆర్‌ఎస్ ప్రభుత్వ అధినేతలు మాత్రం సంకుచిత స్వభావంతో తమపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉద్యమంగా ముందుకు సాగారని వివరించారు. ప్రాజెక్టుల విషయంలో బిఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పరాజయం పాలైందని, ఎన్నికల్లో వరుస ఓటములతో ఆ పార్టీ మనుగడ కష్టమవుతోందని గుర్తించిన కెసిఆర్ మళ్లీ జలవివాదం రేపి తెలంగాణ, ఆంధ్రా ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాలను సృష్టించి తన పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సిఎం విమర్శించారు.
వారి సంతకాలే తెలంగాణకు మరణశాసనం : ఏపీకి కృష్ణానది జలాలలో 66 శాతం శాశ్వత హక్కు కల్పించేలా సంతకం పెట్టింది కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. అప్పట్లో కెసిఆర్, హరీష్‌రావు సంతకాలే తెలంగాణకు మరణశాసనంగా మారాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. ఉమ్మడి ఏపీకి 811 టిఎంసిల నీటి కేటాయింపులు జరిగాయని, తెలంగాణకు రావాల్సిన నీటి కోసం ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని వివరించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కృష్ణా జలాల్లో ఏపీకి 512 టిఎంసిలు, తెలంగాణకు 299 టిఎంసిలు అని చెప్పారని, 299 టిఎంసిల నీళ్లు చాలని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కెసిఆర్ సంతకం చేశారని ఆరోపించారు. కెసిఆర్ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్‌గా మారిందని, అప్పుడు ఏపీకి 66శాతం, తెలంగాణకు 34 శాతం జలాలకు ఆయన అంగీకరించాలరని, తదుపరి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు రాకుండా వాయిదా వేస్తున్నారన్నారు.నదీ పరివాహకం ప్రకారం చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా రావాలని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి వాటాల విషయంలో తెలంగాణ బలంగా వాదిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు
గత నెలలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ కూడా రాసిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసారు. ఏపీ నీటి చౌర్యం చేస్తున్నా మన నీటి వాటా వాడుకోలేని దుస్థితిలో ఉన్నామని సిఎం అన్నారు. ప్రాజెక్టులకు నిధులు, అనుమతుల కోసమే ఢిల్లీకి వెళుతున్నానని, బలమైన వాదనలు వినిపిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. కెసిఆర్‌కు రాజకీయ సమాధి తప్పదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అబద్దాల పోటీ పెడితే కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులు ఫస్ట్ వస్తారని సిఎం అన్నారు. పాలమూరు రంగారెడ్డిపై విచారణ చేపట్టి తప్పు ఎవరిదో తేలుస్తామనేసరికి బిఆర్‌ఎస్ డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీకి తెలంగాణ నీళ్లు తాకట్టు పెట్టామని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని, తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తూ ఏపీకి ఎవరైనా నీళ్లిస్తారా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖలో ఆదిత్యనాథ్ దాస్ అపారమైన అనుభవం ఉన్న అధికారి అని, తెలంగాణలో అన్ని ప్రాజెక్టులపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఏపీ నుంచి ఆయనను తెలంగాణకు తీసుకువచ్చామని వివరించారు. ఆయన ఏపీ, తెలంగాణకు చెందిన వారు కాదని, బిహార్ రాష్ట్రానికి చెందిన వారనిగుర్తు చేశారు.
నీటి లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది : తెలంగాణ వినియోగిస్తున్న నీటి లెక్కలు చూస్తే ఆశ్చర్యం వేస్తోందని, కమిషన్ల కోసమే జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టును మార్చారని, తల వదిలేని తోక దగ్గర నీళ్లు వచ్చేలా ప్రాజెక్టును డిజైన్ చేశారని సిఎం ఆరోపించారు. శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున ఏపీ నీరు తరలిస్తోందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు చేపట్టారని, ఏడేళ్ల వరకు పాలమూరు డీపీఆర్ తయారు చేయలేదని, దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకే డీపీఆర్‌ను దాచారని ఆరోపించారు. రూ.32 వేల కోట్ల ప్రాజెక్టును రూ.80 వేల కోట్లకు పెంచారని వివరించారు. రూ. 20వేల కోట్ల బిల్లులు చెల్లించే వరకు డిపిఆర్ తయారు చేయాలేదన్నారు. పాలమూరుపై వాస్తవాలు చెబితే బనకచర్ల పేరుతో డైవర్ట్ చేస్తున్నారని, డాక్యుమెంట్లు కూడా కనిపించకుండా చేశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోవడానికి మన శక్తి సరిపోదని, ఏపీకి తెలంగాణ నీళ్లు తాకట్టు పెట్టారని విమర్శించారు. మన భూభాగంలో మనం నీళ్లు తీసుకుని ఉంటే చంద్రబాబు, జగన్ ఢిల్లీ దగ్గర మొత్తుకునే పరిస్థితి ఉండేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కంటే కెసిఆర్, హరీష్ తెలంగాణకు దుర్మార్గులని ఆరోపించారు. కెసిఆర్ నిర్ణయంతోనే ఏపీకి ఎక్కువ నీళ్లు వెళుతున్నాయని, కృష్ణా, గోదావరి నదుల మధ్య భూభాగం తెలంగాణ అని సీఎం వివరించారు. తాము వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. శాసనసభలో నీటి వాటాలపై జరిగే చర్యలకు ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తప్పక హాజరు కావాలని, ఎవరూ మిస్ కావద్దని సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
రూ.27 వేల కోట్లు ఇస్తే 90 శాతం పూర్తయినట్టా : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాలు అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు తాము 90 శాతం పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా విస్మరించిందని చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ విషయంలో కేసీఆర్, హరీశ్ రావు సత్య దూరపు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.80 వేల కోట్లు అవసరమని, అలాంటిది ఈ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పిందని, రూ.80 వేల కోట్ల ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా అని ఉత్తమ్ ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు 2015లో జీవో ఇచ్చి డీపీఆర్ మాత్రం ఏడేళ్ల తర్వాత సెప్టెంబర్ 2022లో డీపీఆర్ ను సీడబ్ల్యూసీకి పంపించారన్నారు. ఈ డీపీఆర్‌లో కేవలం రూ. 55 వేల కోట్లు మాత్రమే చూపించారని, ఇందులో ఆయకట్టు కోసం భూసేకరణకు అవసరమయ్యే ఖర్చు, పూర్తి పనుల వ్యయం లేదన్నారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా ఈ ప్రాజెక్టు ద్వారా గత ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రూ.7 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.