Reading Time: 4 minutes

తెలంగాణ కొత్త రాష్ట్రంగా 2014లో అవతరించింది.అప్పటి ఆంధ్రప్రదేశ్ (ఎపి) నుండి విడిపోవడానికి ప్రధాన కారణం నీటి వనరుల పంపకం, అభివృద్ధిలో తెలంగాణకు జరిగిన దీర్ఘకాలిక అన్యాయం. దశాబ్దాల పాటు ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు- ప్రధానంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టిడిపి) తెలంగాణ ప్రాంతానికి న్యాయసమ్మతమైన నది జలాల కేటాయింపులు, వినియోగాన్ని నిర్ధారించడంలో విఫలమయ్యాయి. బచావత్ ట్రిబ్యునల్ అప్పటి ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టిఎంసిల కృష్ణా జలాలలో తెలంగాణకు అందినవి కేవలం సుమారు 200 టిఎంసిలే. అదే విధంగా, ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 1,486 టిఎంసిల గోదావరి జలాలలో (వాటిలో సుమారు 968 టిఎంసిలు తెలంగాణకు కేటాయించబడినప్పటికీ) తెలంగాణలో వాస్తవంగా అభివృద్ధి చేయబడినవి కేవలం సుమారు 300 టిఎంసిలే. 2004 తరువాత పరిస్థితి మరింత దిగజారింది. ఆ కాలంలోనే తెలంగాణకు చెందాల్సిన కృష్ణా జలాలను భారీస్థాయిలో పద్ధతిగా మళ్లించడం ప్రారంభమైంది. 2004 నుంచి 2014 మధ్యకాలంలో కాంగ్రెస్ పాలనలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్, తెలుగు గంగ, గాలేరు- నాగరి, హంద్రి- నీవా తదితర పథకాల ద్వారా రోజుకు సుమారు 4.1 టిఎంసిల కృష్ణా జలాలను అక్రమంగా మళ్లించే మౌలిక సదుపాయాలు నిర్మించబడ్డాయి.

ఈ విధంగా కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు నీటిని తరలించడం ద్వారా తెలంగాణపై వ్యవస్థాబద్ధమైన నీటి దోపిడీకి ఆరంభమైంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, నీటి వనరుల విషయంలో తెలంగాణకు జరిగిన ఇలాంటి అన్యాయాల వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైనప్పటికీ, కొత్త రాష్ట్రం ఏర్పడిన దశలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (ఎపిఆర్‌ఎ -2014) లో సెక్షన్-89ను చేర్చి తెలంగాణకు మరో తీవ్రమైన దెబ్బకొట్టింది. ఎపిఆర్‌ఎ 2014 లోని సెక్షన్- 89 ద్వారా, గత ట్రిబ్యునళ్ల చేసిన ప్రాజెక్టు వారీ కేటాయింపులను కొత్త కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కెడబ్లుడిటి -II) మార్చరాదని నిబంధన పెట్టింది. ఫలితంగా, గతంలో కేటాయించిన 811 టిఎంసిల కృష్ణా జలాల పునర్విభజన కోరే తెలంగాణ సామర్థ్యం తీవ్రంగా పరిమితమైంది. ఈ సెక్షన్ -89 చారిత్రక అన్యాయాన్ని చట్టబద్ధం చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్నే విస్మరించింది.

రాష్ట్ర ఏర్పాటు తరువాత దాదాపు పది సంవత్సరాలు (2014- 2023) పాలించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా సమగ్ర పారదర్శక, వృత్తిపరమైన చర్చలపై ఆధారపడిన నీటి విధానాన్ని రూపొందించడంలో విఫలమైంది. కొత్త రాష్ట్రం గా తెలంగాణకు ప్రజాచర్చలు, నిపుణుల సూచనలు, దీర్ఘకాలిక బేసిన్ స్థాయి ప్రణాళికలపై ఆధారితమైన వ్యూహం అవసరమైంది. కానీ అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు (కెసిఆర్) ఆధ్వర్యంలో నిర్ణయాలు ఒకే వ్యక్తి కేంద్రంగా మారాయి. స్పష్టమైన నీటి విధానం లేకపోవడం, వృత్తిపరులు, విద్యావేత్తలు, రాజకీయ వర్గాల పరిశీలనకు లోబడకపోవడం రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలిగించింది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కృష్ణా జలాలను వినియోగించడం రోజుకు 4.1 టిఎంసిల నుంచి 9.6 టిఎంసిలకు పెరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఆర్‌ఎల్ ఐఎస్), మాచుమర్రి వంటి ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టుల జాబితాలో చేరాయి.

ఈ దశలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 2 లక్షల కోట్లను సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసింది. రుణాలు, అప్పుల అంశాలు ప్రాముఖ్యత కలిగినవే అయినప్పటికీ, అసలు సమస్య వ్యూహాత్మక తప్పుదారి పట్టడమే. దీన్ని ఒక ఉదాహరణతో అర్థ్ధం చేసుకోవచ్చు. ఒక దేశానికి ఒక సురక్షిత సరిహద్దు, మరో ప్రమాదకర సరిహద్దు ఉంటే, మొదట ప్రమాదకర సరిహద్దును బలపర్చడమే ప్రాధాన్యత కావాలి. ఇదే తర్కాన్ని ఇక్కడ వర్తింపజేస్తే, గోదావరి బేసిన్ తెలంగాణకు ‘సురక్షిత సరిహద్దు’ కాగా, కృష్ణా బేసిన్ ‘ప్రమాదకర సరిహద్దు’. కానీ, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రమాదకర సరిహద్దుపై కాకుండా సురక్షిత సరిహద్దుపైనే దృష్టి సారించింది.

గోదావరి బేసిన్‌లో తెలంగాణకు అంతర్రాష్ట్ర జలవివాదాలు తక్కువగా ఉన్నాయి. ఏకీకృత ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 1,468 టిఎంసిలలో సుమారు 968 టిఎంసిలు తెలంగాణకు, 518 టిఎంసిలు ఎపికి కేటాయించబడ్డాయి. అందువల్ల గోదావరి బేసిన్‌లో తెలంగాణకు ప్రాజెక్టుల కోసం నీటి లభ్యత దాదాపు నిర్ధారితంగా ఉంది. కానీ కృష్ణ్ణా బేసిన్‌లో అనేక పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి:

1.సెక్షన్-89 పరిమితి: బచావత్ ట్రిబ్యునల్ చేసిన ప్రాజెక్టు వారీ కేటాయింపులను పునఃపరిశీలించడానికి కెడబ్లుడిటి -IIకి నిషేధం ఉండటం వల్ల, 811 టిఎంసిలలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కలేదు.

2. అంతర్రాష్ట్ర ఒప్పందంలో తప్పిదం: 2015లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం, కెడబ్లుడిటిT-II అవార్డు వచ్చేవరకు, 811 టిఎంసిలలో కేవలం 299 టిఎంసిలను మాత్రమే వినియోగించుకోవాలని ఎపితో ఒప్పందం చేసుకుంది. తెలంగాణకు సుమారు 500 టిఎంసిల వరకు బేరసారాలు చేయగల స్థితి ఉన్నప్పటికీ, అలా చేయలేదు. ఒక సంవత్సరానికి మాత్రమేనని చెప్పినా, ఈ ఒప్పందాన్ని 2016, 2020లో పునరావృతం చేశారు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఈ 299 టిఎంసిలలో కల్వకుర్తి (53 టిఎంసిలు), నెట్టెంపాడు (25.4), ఎస్‌ఎల్‌బిసీ (40), పాలమూరు -రంగారెడ్డి (90), దిండి (30), కోయిల్ సాగర్ (3.3) వంటి కీలక తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్కచుక్క నీటి కేటాయింపూ లేదు. నిర్మాణానికి ముందు నీటి కేటాయింపులు సాధించడమే ప్రాధాన్యత కావాల్సింది. కానీ అది అలా జరగలేదు..

3. వినియోగ లోపం: 2014 నుంచి ఇప్పటివరకు, తెలంగాణ తాను ఒప్పుకున్న 299 టిఎంసిలను ఒక్కసారైనా పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. కారణం- కృష్ణా బేసిన్‌లోని అనేక ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయకపోవడం.

4. అదనపు TORలో ఆలస్యం: 1956 ఐఎస్‌ఆర్‌డబ్లుడి చట్టం సెక్షన్- 3 ప్రకారం కెడబ్లుడిటి -IIకి అదనపు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలని బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2015 లో కేంద్రాన్ని కోరినా, మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా అందులో చేర్చాలని పట్టుబట్టింది. సుప్రీం కోర్టులో కేసు వేసినా ఉపశమనం దక్కలేదు. కేంద్ర ప్రభుత్వం పదే పదే కేసు ఉపసంహరించుకోవాలని సూచించినా, సంవత్సరాల పాటు ఆలస్యం చేశారు. 2021 అక్టోబర్‌లో అంగీకరించిన తరువాత కూడా, ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది. చివరకు 2023 అక్టోబర్‌లో అదనపు టిఒఆర్‌లు జారీ అయ్యాయి. దీని ద్వారా 1,050 టిఎంసిల (బచావత్ ట్రిబ్యునల్‌కు చెందిన 811 టిఎంసి+ కెడబ్లుడిటి-IIకు చెందిన 194 టిఎంసి + గోదావరి మళ్లింపు ద్వారా వచ్చే 45 టిఎంసి) తాజా కేటాయింపుకు మార్గం తెరచుకుంది. ఈ ఆలస్యం తెలంగాణకు దాదాపు పది సంవత్సరాల నష్టాన్ని కలిగించింది.

ఈ పరిస్థితుల్లో సరైన వ్యూహం ఏమి ఉండాల్సిందంటే ముందుగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, కనీసం 500 టిఎంసిల తాత్కాలిక వినియోగాన్ని సాధించడం, 2015 నాటికే కేసు ఉపసంహరించుకొని అదనపు టిఒఆర్‌లు పొందడం. కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇవి చేయలేకపోవడం వల్ల, తెలంగాణకు నష్టం జరిగింది. ఇప్పటికే సురక్షితమైన గోదావరి బేసిన్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికంగా దృష్టి పెట్టి, కృష్ణా బేసిన్‌ను నిర్లక్ష్యం చేసింది. అయితే, కనీసం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను అయినా సక్రమంగా అమలు చేశారా అంటే, అది కూడా జరగలేదు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోనే మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు డిజైన్ లోపాల వల్ల సమస్యల్లో చిక్కుకున్నాయి. గోదావరి బేసిన్‌లోని సీతారామ సాగర్, సమ్మక్క- సారక్క వంటి ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తికాకపోవడం వల్ల, నీటి వినియోగం పరిమితమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లడం లేదు. దీని వల్ల పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేని ప్రాజెక్టులకు అవసరమైనంత నీటి అవసరాలను కెడబ్లుడిటి-II పరిగణనలోకి తీసుకోకపోయే ప్రమాదం ఉంది.

పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (పిఆర్‌ఎల్‌ఐ ఎస్) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 90 టిఎంసితో డిపిఆర్‌ను సమర్పించింది. ఇందులో బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు కేటాయించిన 90 టిఎంసి చిన్న నీటిపారుదల జలాలలో తక్కువగా వినియోగమైన ట్యాంకుల నుంచి 45 టిఎంసి, గోదావరి నుంచి మళ్లింపు ద్వారా వచ్చే 45 టిఎంసి ఉన్నాయి. గోదావరి మళ్లింపు అంశం ఇప్పటికే అదనపు టిఒఆర్‌ల కింద కెడబ్లుడిటి-II పరిధిలో పరిశీలనలో ఉంది. అయితే, కేంద్ర జల కమిషన్ (సిడబ్లుసి) కోరినట్లుగా తక్కువగా వినియోగమైన ట్యాంకుల వారీ వివరాలు (నిల్వ సామర్థ్యం, వినియోగం, తక్కువగా వినియోగమైన పరిమాణం) అందించడంలో అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ విఫలమయ్యాయి. అందువల్ల డిపిఆర్‌ను తిరిగి పంపించారు; అది తిరస్కరించబడలేదు. సరైన, సమగ్ర డేటా సమర్పిస్తే డిపిఆర్‌కు తప్పకుండా ఆమోదం లభిస్తుంది. మొత్తంగా చూస్తే, తెలంగాణ ఎదుర్కొంటున్న నీటి సమస్యలు కేవలం కాంగ్రెస్ పాలనలో జరిగిన చారిత్రక అన్యాయాల వల్లనే కాకుండా, బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన వ్యూహపరమైన తప్పిదాలు, ఆలస్యాలు, తప్పు ప్రాధాన్యతల వల్ల కూడా ఏర్పడ్డాయి. బేసిన్ -స్థాయి వాస్తవికత, వృత్తిపరమైన ప్రణాళికలు, కేంద్ర సంస్థలతో సమయోచిత సమన్వయం ఆధారంగా మార్గసరిచేయడం మాత్రమే తెలంగాణకు న్యాయమైన నదీ జలాల వాటాను సాధించగలదు.

శ్రీరామ్ వెదిరే