
కొత్త సంవత్సరం ప్రవేశించింది. గత ఏడాది ఎదురైన సమస్యలు, సవాళ్లు దాటుకుని రాష్ట్రాలు తమ విభిన్న ప్రాంతీయ ప్రాధాన్యతలు, వనరులు, సామాజిక సందర్భాలు అన్వయించుకున్న ఆకాంక్షలతో ముందుకువెళ్లడానికి సిద్ధమయ్యాయి. అయితే రాష్ట్రాల అభివృద్ధి నమూనాలన్నీ ఒకేలా ఉండవు. జాతీయ దృక్పథానికి కట్టుబడి కొన్ని పారిశ్రామిక విస్తరణ తప్పనిసరి స్పష్టం చేస్తుండగా, మరికొన్ని రాష్ట్రాలు వ్యవసాయం, సాంకేతిక రంగాలతోపాటు పర్యాటకం, సేవా రంగాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ ఆకాంక్షలు నెరవేరాలంటే ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం పరిఢవిల్లాలని, అభివృద్ధి పథకాల అమలుకు నిధులు ఇచ్చిపుచ్చుకోవడంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి ఈ 2026 సంవత్సరంలో ఇవన్నీ ఎంతవరకు నెరవేరుతాయో ఆయా రాష్ట్రాల ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకోవలసి ఉంది. 2026 లోనే పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌కు, కేంద్రానికి మధ్య భగ్గుమంటోంది. మత సామాజిక రాజకీయాలు తీవ్రంగా ఉంటున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సమగ్ర సవరణ సర్వే (సర్) అత్యంత కీలకమైన వివాదంగా తెరపైకి వస్తోంది. ఈ ప్రక్రియను ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లనే తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె హెచ్చరిస్తున్నారు. విపక్ష బిజెపి నేత సువేందు అధికారి లక్షలాది బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదార్లను, రోహింగ్యాలను ఓటర్ల జాబితాల నుంచి తొలగించడమవుతుందని చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి దృష్టి మరల్చేందుకు పాలనా పరమైన లోపాలను ఎత్తిచూపడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. ఎన్నికల సమయంలో హింస భగ్గుమనడం పశ్చిమబెంగాల్‌లో ఆనవాయితీ అని అందుకే జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తోంది. అయితే పశ్చిమబెంగాల్‌లో నిరుద్యోగం తాండవిస్తోంది. 30 లక్షల కార్మికులు బెంగాల్ బయట ఉపాధి పొందుతుండడం మమతా బెనర్జీకి అగ్నిపరీక్ష కానుంది. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసోం రాష్ట్ర బిజెపి ప్రభుత్వం ఈశాన్య భారతంలో తిరిగి తమ పట్టు నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తోంది. 780 మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపించేశారు.
గత ఏడాది నుంచి సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టారు. ఆరు సామాజికవర్గాలకు ఎస్‌టి హోదా కల్పించాలన్న డిమాండ్ ఈ ఏడాదైనా నెరవేర్చగలుగుతారా లేదా అన్నది ఒక సవాలుగా మారింది. ఒకపక్క మణిపూర్‌లో జాతుల విద్వేషం రావణకాష్టంలా రగులుతుండగా, అనేక వేలమంది నిర్వాసితులు కావడంతో పునరావాస చర్యలను ముమ్మరం చేసినప్పటికీ ఫలితం కనబడటం లేదు. జమ్మూకశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వహోదా పునరుద్ధరణే ప్రధాన డిమాండ్‌గా ముందుకు సాగుతోంది. ఈ కొత్త సంవత్సరంలో కేంద్రం నుంచి ఎంతవరకు ఆ డిమాండ్‌ను సాధించగలదో సవాలుగా మారింది. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లు నిర్వహిస్తున్నా భద్రతా సవాళు తప్పడం లేదు. చత్తీస్‌గఢ్ రాష్ట్ర బిజెపి ప్రభుత్వం 2026 మార్చి 31నాటికి మావోయిస్టుల పూర్తి నిర్మూలనే ప్రధాన లక్షంగా పెట్టుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాంతం బస్తరు జిల్లాలో ఇప్పటికి ఆరుసార్లు పర్యటించారు.
2026 సంవత్సరాన్ని మాతృత్వ సాధికారిత సంవత్సరంగా గౌరవిస్తూ ‘మహాతరి గౌరవ్ సంవత్సరం’గా ముఖ్యమంత్రి విష్టుదేవ్ సాయి ప్రకటించడం విశేషం. మహిళల సంక్షేమమే దీని లక్షం. కొత్త సంవత్సరం వచ్చినా రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తప్పడంలేదు. పాలకవర్గం బిజెపి, విపక్షం కాంగ్రెస్‌లో కూడా అంతర్గత కుమ్ములాటలు పెచ్చుమీరుతున్నాయి.త్వరలో అక్కడ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఆరావళి కొండల వివాదం రాష్ట్రాన్ని ఇరకాటంలో పెడుతోంది. దీనికి తోడు రూ. 6 లక్షల కోట్లకు పైగా రుణభారం రాష్ట్రాన్ని కుంగదీస్తోంది. పంజాబ్ రాష్ట్రం 2027లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వికసిత్ భారత్ 2047 జాతీయ దృక్పథంతో ప్రాంతీయ ప్రాధాన్యంతో పథకాలను అమలు చేస్తోంది. ఉత్తరాఖండ్ టౌన్ ప్లానింగ్ స్కీమ్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, జనవిశ్వాస్ నియోజన చట్టం, తదితర పథకాలను ఈ కొత్త సంవత్సరంలో అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది.
గుజరాత్ ఈ 2026ను క్రీడా పోటీల సంవత్సరంగా పరిగణిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు అహ్మదాబాద్‌లో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు, అలాగే ఆర్చరీ ఆసియా పారాకప్, వరల్డ్ రాంక్ టోర్నమెంట్ నిర్వహించనున్నది. 2026 జనవరి 8 నుంచి రాజ్‌కోట్‌లో గుజరాత్ వాణిజ్య ప్రదర్శన నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించింది. మహారాష్ట్రలో అధికార మహాయుతి, పొత్తులతో ప్రభుత్వం నడుపుతున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సంక్షోభం తలెత్తుతోంది. విపక్ష మహావికాస్ అఘాయిత్‌లో కూడా చీలికలు కనిపిస్తున్నాయి. ముంబై నుంచి కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తోంది. శరద్‌పవార్, అజిత్ పవార్ మళ్లీ ఏకమయ్యారు. మధ్యప్రదేశ్‌కు ప్రాజెక్టు చీటా ఈ కొత్త సంవత్సరంలో ఊపు కలిగిస్తుంది. బోత్సానా నుంచి వచ్చిన 8 చీటాలు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంటున్నాయి. రిపబ్లిక్‌డే నాటికి అవి కునో నేషనల్ పార్కుకు చేరుకుంటాయని అంచనా. జార్ఖండ్ రాష్ట్రం ఈ కొత్త సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇవిఎంలు తగినంత అందుబాటులో లేకపోవడంతో మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహిస్తారు.