Reading Time: < 1 minute

 డ్రైనేజీలో మృత శిశువు లభ్యమైంది.పారిశుధ్య కార్మికులు డ్రైనేజీ శుభ్రం చేస్తుండగా మృత శిశువు కనిపించింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని శాబునగర్‌లో చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  బుధవారం డ్రైనేజీని శుభ్రం చేసేందుకు వచ్చిన మున్సిపల్ సిబ్బంది కాల్వలో పారతో చెత్తను తీస్తున్న క్రమంలో నెలలు నిండని మృత శిశువు వచ్చిందని తెలిపారు.  దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది స్థానికులకు,  పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు వన్‌టౌన్ సిఐ నాగభూషణం అక్కడికి చేరుకుని మృత శిశువును పరిశీలించి అనంతరం ఏరియా ఆసుపత్రి మార్చురికి తరలించారు.కాగా రాత్రి 3గంటల సమయంలో ఒక వ్యక్తి ఆ రోడ్డు గుండా వెళుతున్న దృశ్యాలు సిసి టివి పుటేజ్‌లో కనిపించడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిఎస్పీ కె.రాజశేఖర్‌రాజు అట్టి స్థలానికి చేరుకుని పరిశీలించారు. 5 టీంలు ఏర్పాటు చేసి సమగ్ర విచారణకు చేపట్టామని తెలిపారు. అదేవిదంగా ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించి,కాలనీలో సమగ్రంగా గర్భిణీలను గుర్తించాలని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ నాగభూషణం తెలిపారు.

గతంలో సబ్ జైల్ రోడ్డులో…నేడు షాబూనగర్‌లో

గత నవంబర్‌నెలలో మిర్యాలగూడ పట్టణంలోని సబ్ జైల్ రోడ్డులో ప్రధాన డైనేజీ కాల్వలో కవర్లో కట్టిపడేసిన మృత శిశువు లభించగా,నెల వ్యవధిలోనే షాబూనగర్‌లో డ్రైనేజీలో నెలలు నిండని మృత శిశువు లభించడం పట్ల పట్టణంలో చర్చనీయాంశం అయ్యింది. ప్రైవేటు ఆసుపత్రులలో విచ్చలవిడిగా అబార్షన్లు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్యాధికారుల నిర్లక్షం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయని,ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు అధికారులకు భారీ ముడుపులు ముట్టజెప్పడంతోనే వారిపై పర్యవేక్షణ చేయడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆసుపత్రులపై తగిన చర్యలు తీసుకోవాలని,ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.