
“మాతో పోరాడేందుకు కాంగ్రెస్ బిఆర్‌ఎస్ ఏకమయ్యాయి..” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ సారథ్యంలోని ‘ఇండి’ కూటమిలో ఉన్న సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో మంతనాలు జరపడంలోని మతలబు ఏమిటని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తాము (బిజెపి) కాబట్టి కాంగ్రెస్-బిఆర్‌ఎస్ ఏకమయ్యాయని ఆయన విమర్శించారు. గతంలో తమిళనాడు సిఎం స్టాలిన్ పిలిచినప్పుడు కూడా ఈ రెండు పార్టీల నేతలు వెళ్ళారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, తోడు దొంగల ఈ రాజకీయాలను గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఈ రెండు పార్టీలకు స్టాలిన్, అఖిలేష్, మమతా బెనర్జీ వంటి వాళ్ళు మద్దతునిస్తున్నారని ఆయన ఆరోపించారు.
గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో తమ పార్టీ మూడు వందల సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నదని రాంచందర్ రావు తెలిపారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి ఫలితంగా ఈ విజయం చేకూరిందన్నారు. అంతేకాకుండా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగెత్తారని, తమ పార్టీ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. వచ్చే రెండు విడతల్లోనూ తమ పార్టీని ఆదరించి, ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. గతంలో తమకు ఒక్క స్థానం కూడా లేని జనగాంలో రెండు, మహబూబాబాద్‌లో ఆరు, భూపాల్‌పల్లిలో మూడు, సంగారెడ్డిలో ఆరు, వనపర్తిలో ఆరు, నాగర్ కర్నూలులో మూడు సర్పంచ్ స్థానాలను గెలుపొందామని ఆయన వివరించారు. ఉప సర్పంచ్‌లతో పాటు అనేక వార్డు సభ్యులుగా కూడా తమ పార్టీకి చెందిన వారు గెలుపొందారని ఆయన వివరించారు. తాము గెలుపొందని జిల్లా అంటూ ఏదీ లేదని, అన్ని జిల్లాల్లోనూ గెలుపొందామని ఆయన చెప్పారు. మొదటి విడతలో వేల సంఖ్యలో గెలిచామని కాంగ్రెస్, బిఆర్‌ఎస్ చెప్పుకుంటున్నాయని ఆయన తెలిపారు. గెలుపొందిన వారు ఎవరు? ఎక్కడ ఉన్నారు? అని ఆయన ప్రశ్నించారు.