
తిరుమల పరిశుభ్రత, స్వచ్ఛతపై దృష్టి సారించింది టీటీడీ. పారిశుధ్య నిర్వహణ కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు.
2026 ఆగస్టు 14న పారిశుద్ధ్య విభాగం అధికారులు, సంబంధిత ఏజెన్సీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కొత్తగా నందకం యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను రియల్ టైమ్‌లో నమోదు చేసే అవకాశం ఉంటుందని.. దీంతో వాటి పరిష్కారాన్ని కూడా పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.
తిరుమలలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య తలెత్తితే వెంటనే యాప్ ద్వారా గుర్తించి, సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి, సమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ లో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.
తిరుమలతో పాటు ఘాట్ రోడ్లు, శ్రీవారి మెట్టు, అలిపిరి ఫుట్‌పాత్, ఇతర పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు, మన ఊరు – మన గుడి వంటి సంస్థలు ముందుకు వచ్చి శుభ్రతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను అధికారులు, సిబ్బంది మాత్రమే బాధ్యతగా భావించకుండా ప్రతి భక్తుడు కూడా తన బాధ్యతగా తీసుకోవాలని అదనపు ఈవో కోరారు.
భక్తులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల నుంచి చెత్తను బయటకు విసిరేయడం, ప్రయాణంలోనే ప్లాస్టిక్ తదితర వస్తువులను పడేయడం వంటి చర్యలు తరచుగా కనిపిస్తున్నాయని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు భక్తులు ప్లాస్టిక్‌ను తీసుకువచ్చి ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని చెప్పారు.
తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడి పవిత్రత, స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పుడు వారికి భక్తులు కూడా సహకరించాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి కోరారు. ఈ సమావేశంలో హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఏజెన్సీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.