
తెలంగాణలో భూసేకరణ, అభివృద్ధి పనులకు సంబంధించి టీడీఆర్ ( Transferable Development Rights) జారీ , వినియోగ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ పరిధిలో టీడీఆర్ విధానాన్ని మరింత పారదర్శకంగా మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తాజా నిబంధనల ప్రకారం.. హెచ్‌ఎండీఏ పరిధిలోని CURE & PURE ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు ఇకనుంచి హెచ్‌ఎండీఏ అధికారికంగా టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయనుంది. అలాగే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో పలు ప్రాజెక్టుల నిమిత్తం సేకరించిన భూములకు కూడా టీడీఆర్ వర్తింపజేయాలని నిర్ణయించారు.
ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండేలా టీడీఆర్ సర్టిఫికెట్లన్నింటినీ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ప్రాసెస్ చేయనున్నారు. హెచ్‌ఎండీఏ జారీ చేసే ఈ టీడీఆర్ సర్టిఫికెట్లను.. హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవడానికి అవకాశం కల్పించారు. జారీ చేసిన వివరాలను సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్లు, అర్బన్ లోకల్ బాడీలు (ULB), FCDAకు సమాచారం కోసం పంపనున్నారు.
టీడీఆర్ జారీ ,యుటిలైజేషన్‌కు అనుగుణంగా ‘BuildNow’ సిస్టమ్‌లోనూ తగిన మార్పులు చేర్పులు చేశారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ ఈ కీలక ఉత్తర్వులపై సంతకం చేశారని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో భూసేకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు బాధితులకు సత్వర ప్రయోజనం చేకూరనుంది.