
తెలంగాణలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా , మరో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రామచంద్రాపురం మండలంలోని నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యులయ్యారు.
సుమారు 90 ఎకరాల ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఈ నల్లగండ్ల చెరువులో.. దాదాపు 70 ఎకరాలు రైతుల పట్టా భూములే కావడం గమనార్హం. అయితే, చెరువు అభివృద్ధికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఇక్కడ విశేషం. గతంలోనే రైతులందరూ సంతకాలతో హైడ్రాకు వినతిపత్రం అందజేసి, తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. బదులుగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం టిడిఆర్ కింద తగిన నష్టపరిహారం అందేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కమిషనర్ రంగనాథ్, టిడిఆర్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఇక ఆక్రమణల తొలగింపు ద్వారా అదనంగా మరో 13 ఎకరాలు అందుబాటులోకి రాగా.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కలిపి మొత్తం 103 ఎకరాల్లో ఈ చెరువును అభివృద్ధి చేయనున్నారు. చెరువులో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించి, మరింత లోతుగా తవ్వడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. అంతేకాకుండా, భారీ వరద నీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా చెరువులోకి చేరేలా ఇన్‌లెట్లను, అలాగే ఔట్‌లెట్లను పటిష్టంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
చెరువు చుట్టూ పచ్చదనం పెంపొందించి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే కాకుండా, చెరువు కట్టపై ఉన్న పురాతన అమ్మవారి ఆలయానికి తగిన స్థలాన్ని కేటాయించి పూజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ఈ నల్లగండ్ల చెరువు పునరుద్ధరణ పనులు.. భవిష్యత్తులో నగరానికి మరో అద్భుతమైన జలవనరుగా మారనున్నాయి.