Reading Time: < 1 minute
India Italy Relations Centre Reacts To Congress Remarks On Giorgia Meloni

Govt on Congress: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘‘మనకు ఇటలీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాము. ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన ఎంతో ముఖ్యం. ఏ విషయాన్నైనా గౌరవంగా ముందుకు తీసుకురావాలి’’ అని విదేశాంగ ప్రతినిధి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ జార్జియా మెలోని ప్రస్తావన తీసుకువచ్చారు.

గురువారం ఢిల్లీలో క్రియేటివ్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. విదేశాంగ విధానం అంటే కౌగిలించుకోవడం అనే ఆలోచన ఆయన బుర్రలోకి ఎలా వచ్చింది? అంటూ వ్యాఖ్యానించారు. సెటైరికల్‌గా కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్‌‌ను స్టేజ్‌పై కౌగిలించుకున్నారు. అయితే, ఆ సమయంలో సందీప్ దీక్షిత్ రాహుల్ గాంధీతో ‘‘నన్ను మీరు మెలోనీ అనుకోలేదు కదా?’’ అని అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వారు. దీనికి సమాధానంగా రాహుల్ గాంధీ..‘‘నేను ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు’’ అని అన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాంగ్రెస్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ, దేశాన్ని నడిపించడానికి పరిణతి చెందిన నాయకత్వం అవసరమని అన్నారు. ప్రధాని మోదీని అవమానించే వ్యాఖ్యలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ దేశ ప్రజలను కూడా అవమానిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గతంలో పలువురు విదేశాల అధినేతల్ని ఆలింగనం చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.