Reading Time: < 1 minute
Cji Surya Kant Cockroach Remark Clarification Court Video Clips

CJI Surya Kant: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ మరోసారి తన ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించి యువతను తప్పుదోవ పట్టించేందుకు దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన అసంపూర్ణ క్లిప్‌లు ప్రచారం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డీడీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కోర్టు కార్యకలాపాల వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేస్తున్నారని అన్నారు. తనకు జరిగిన సంఘటన అత్యంత దురదృష్టకరమని, నేను చెప్పింది వక్రీకరించారని, దేశ యువతను తప్పుదారి పట్టించడానికి ఇది దారుణమైన, దురుద్దేశపూరిత ప్రయత్నమని అన్నారు.

2026 మే 15న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా, నకిలీ డిగ్రీలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమందిని సీజేఐ సూర్యకాంత్ ‘బొద్దింకలతో’ పోల్చారు. ఇలాంటి వ్యక్తులు సోషల్ మీడియా లేదా ఆర్టీఐ కార్యకర్తలుగా మారి వ్యవస్థను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని తప్పుదారి పట్టిస్తూ యువతను ‘‘బొద్దింకలు’’గా పోల్చారని సీజేఐపై తప్పుడు ప్రచారం చేశారు. దీనిని ఒక అస్త్రంగా మలుచుకుని ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ నీట్‌ పేపర్ లీక్‌పై పెద్ద ఉద్యమమే చేసింది.

ఇదిలా ఉంటే, ఈ ఇంటర్వ్యూలో సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. కోర్టు కార్యకలాపాలకు సంబంధించి మీడియా బాధ్యతయుతంగా ఉండాలని కోరారు. సమాజంలో సామరస్యాన్ని కాపాడటం ప్రతీ పౌరుడి హక్కు మాత్రమే కాకుండా రాజ్యాంగపరమైన బాధ్యతగా భావించాలని అన్నారు. ఒక వ్యక్తి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా లేదా మరే ఇతర మాధ్యమంలో ఉన్నా, లేదా ఒక సాధారణ పౌరుడైనా, ప్రతి ఒక్కరికీ హక్కులు, బాధ్యతలు ఉంటాయని ఆయన అన్నారు. హక్కులు ముఖ్యమైనవే అయినప్పటికీ, వ్యక్తులు తమ బాధ్యతలను నెరవేర్చే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలని సూచించారు.