Reading Time: < 1 minute
Tirumala: టీటీడీ ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా శ్రీధర్ వర్మ.. 22న ప్రమాణ స్వీకారం

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్‌గా శ్రీధర్ వర్మ నియమితులయ్యారు. టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఆయనకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన టీటీడీ చైర్మన్ సహా ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యులను కలిశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ శరత్‌లను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శ్రీధర్ వర్మను చైర్మన్‌గా నియమిస్తూ టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ క్యాంపు కార్యాలయంలో శ్రీధర్ వర్మ తన నియామక పత్రాన్ని అధికారికంగా అందుకున్నారు. శ్రీధర్ వర్మ సారథ్యంలో ఎస్వీబీసీ ఛానల్ సరికొత్త కార్యక్రమాలతో ఆధ్యాత్మిక ప్రసార రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఈఓ ఆకాంక్షించారు.

అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని శ్రీధర్ వర్మ కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు చైర్మన్ ఆశీస్సులు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారావులను కూడా శ్రీధర్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ ఈ నెల 22వ తేదీన అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. శ్రీవారి భక్తులకు మరింత చేరువయ్యేలా నాణ్యమైన ఆధ్యాత్మిక కంటెంట్‌ను అందించడమే తన ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.