Reading Time: 2 minutes

వన్డే, టీ20ల్లో అదుర్స్.. టెస్ట్‌ల్లో దారుణం.. భారత జట్టుకు అతడే మైనస్!

Caption of Image.

Team India: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్‌లతో ట్రోఫీల పంట పండిస్తున్న భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌, టెస్టు ఫార్మాట్ వచ్చేసరికి ఘోరంగా విఫలమైతున్నాడు. వైట్ బాల్ మ్యాచ్‌లలో గంభీర్ వేసే వ్యూహాలు గంటల వ్యవధిలో హిట్టవుతుంటే.. టెస్టుల్లో మాత్రం ఐదు రోజుల పాటు దణ్ణం పెట్టుకోవాల్సి వస్తోంది. అయితే శ్రీలంక సిరీస్‌లో తేడా వస్తే గంభీర్ కుర్చీ మడతపెట్టేస్తారని ప్రచారం జరిగినా, చివరకు బీసీసీఐ పెద్దలు మాత్రం నో నో.. ఆయనకు ఇంకా టైమ్ ఇవ్వాలంటూ మళ్లీ మళ్లీ ఛాన్సులు ఇస్తున్నారు. 

విమర్శకుల ఆశలపై నీళ్లు: 
మొన్నటిదాకా ఇంగ్లాండ్, ఐర్లాండ్ వైట్ బాల్ పరాజయాల తర్వాత గంభీర్‌ను టెస్టుల నుంచి తప్పించాలంటూ సోషల్ మీడియాలో పెద్దెత్తున్న ట్రోలింగ్ చేశారు. శ్రీలంకతో రేపటి (ఆగస్టు 15 ) నుంచి జరిగే 2 టెస్టుల సిరీస్ ఓడిపోతే గంభీర్ ప్యాకప్ అని లీకులు కూడా బయటకు వచ్చాయి. కానీ, సీన్ కట్ చేస్తే ఇప్పుడు బీసీసీఐ పూర్తిగా ప్లేట్ ఫిరాయించింది. అబ్బే టెస్టుల్లో శ్రీలంక చేతిలో క్లీన్ స్వీప్ అయినా సరే.. గంభీర్ రాజీనామా లేఖ రాసి చేతిలో పెడితే తప్ప, మేంగా అతడ్ని జట్టు నుంచి తప్పించడం కుదరదని తేల్చి చెప్పింది. 

ట్రాన్సిషన్ పీరియడ్’ మాయాజాలం: 
టెస్టుల్లో ఘోర పరాజయాలు ఎదురవుతుంటే, విమర్శకుల నోళ్లు మూయించడానికి బీసీసీఐకి ఒక అద్భుతమైన పదం దొరికింది.. అదే ట్రాన్సిషన్ పీరియడ్. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్లు హఠాత్తుగా రెడ్ బాల్‌కి గుడ్ బై చెప్పేయడంతో జట్టు సమతుల్యత దెబ్బతిందట. ఇక జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ వంటి కీలక ప్లేయర్లు లంక సిరీస్‌కు గాయాల పాలయ్యారు.  ఉన్నపళంగా దిగ్గజాలు వెళ్లిపోతే, కుర్రాళ్లతో కొత్త జట్టును తీర్చిదిద్దడానికి హెడ్ కోచ్‌ గంభీర్ కి కాస్త సమయం పడుతుందని బీసీసీఐ సపోర్ట్ చేసింది.  

లంక పర్యటన.. కోచ్‌కి నిజమైన పరీక్షేనా?: 
8 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రెడ్ బాల్ పట్టుకుని శ్రీలంకలో అడుగు పెడుతున్న గంభీర్ బృందానికి గాయాల సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. కానీ బీసీసీఐ ఇచ్చిన ఈ ఫుల్ సపోర్టుతో గంభీర్ రిలాక్స్ అవుతాడా లేక లంక స్పిన్ ట్రాక్‌లపై ఈ కుర్రాళ్లతో అద్భుతం చేసి విమర్శకుల నోళ్లు మూయిస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఓడినా గంభీర్ పదవికి ఢోకా లేదు కాబట్టి, అతడు పెద్దగా భయపడాల్సిన పనిలేదు. 

©️ VIL Media Pvt Ltd.