Reading Time: 2 minutes

మార్కస్ మెరుపులు, ప్రభ్‌సిమ్రాన్ దూకుడు.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

Caption of Image.

PBKS vs RR: న్యూ చండీగఢ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 బ్లాక్‌బస్టర్ పోరులో పంజాబ్ కింగ్స్ (PBKS) పరుగుల సునామీ సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ముల్లన్‌పూర్ మైదానాన్ని సిక్సర్ల మోతతో హోరెత్తించారు. ముఖ్యంగా చివర్లో మార్కస్ స్టోయినిస్ చేసిన విధ్వంసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పంజాబ్ బ్యాటర్లు అగ్రెసివ్ మూడ్‌లో కనిపించారు. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (18) నాండ్రే బర్గర్ వేసిన రెండో ఓవర్‌లోనే 21 పరుగులు పిండుకుని స్టేడియంలో హీట్ పెంచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కూపర్ కొన్నోలీ (14 బంతుల్లో 30) మెరుపులు మెరిపించగా, మరోవైపు ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 44 బంతుల్లో 59 పరుగులు చేసి ఐపీఎల్‌లో తన 4వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (30) సహకారంతో పంజాబ్ భారీ స్కోరుకు గట్టి పునాది వేసింది. రాజస్థాన్ బౌలర్లలో యువ సంచలనం యశ్ రాజ్ పుంజా రెండు కీలక వికెట్లు తీసి పంజాబ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.

అయితే, అసలు సిసలైన క్లైమాక్స్ ఇన్నింగ్స్ చివర్లో మొదలైంది. ఆస్ట్రేలియన్ పవర్‌హౌస్ మార్కస్ స్టోయినిస్ ఆఖరి ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా బ్రిజేష్ శర్మ వేసిన చివరి ఓవర్లో 4, 6, 6, 4, 4 బాది ఏకంగా 24 పరుగులు రాబట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. స్టోయినిస్ కేవలం 22 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ సెట్ చేసిన ఈ 223 పరుగుల టార్గెట్‌ను రాజస్థాన్ రాయల్స్ ‘హిట్ మ్యాన్’ వైభవ్ సూర్యవంశీ ఎలా ఛేజ్ చేస్తారో చూడాలి. 

 

©️ VIL Media Pvt Ltd.