
అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మధ్యాహ్నం ఒంటి గంట సమయం.. కస్టమర్లతో బ్యాంక్ కోలాహాలంగా ఉంది.. ఇదే సమయంలో నలుగురు వ్యక్తులు నాలుగు గన్స్ పట్టుకుని బ్యాంకులోకి చొరబడ్డారు. వచ్చిరాగానే తుపాకులు చూపించి కస్టమర్లు, బ్యాంక్ సిబ్బందిని బెదిరించారు. కొందరు బ్యాంకు సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ ఎక్కు పెట్టి బలవంతంగా బ్యాంక్ స్ట్రాంగ్ రూం లాక్ తెరిపించారు. అందులోని రూ.50 లక్షలతో ఎస్కేస్ అయ్యారు. ఈ మొత్తం దోపీడి కేవలం 13 నిమషాల్లోనే ముగిసింది. సినీ తరహాలో జరిగిన ఈ బ్యాంక్ రాబరీ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో జరిగింది.
సూరత్‌లోని డైమండ్ సిటీ ప్రాంతంలో పట్టపగలు జరిగిన భారీ దోపిడీ తీవ్ర కలలకం రేపింది. సోమవారం (ఏప్రిల్ 27) మధ్యాహ్నం వరాచాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) బ్యాంక్‌లోకి చొరబడ్డ నలుగురు దుండగులు రూ.50 లక్షలు దోచుకున్నారు. దోపిడీదారులు బ్యాంకులో ఉన్న ఉద్యోగులను తుపాకీతో బెదిరించి వారిని బందీలుగా పట్టుకున్నారు. అనంతరం బ్యాంకు స్ట్రాంగ్ రూమ్, క్యాష్ కౌంటర్ నుంచి సుమారు 50 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.
కేవలం 13 నిమిషాల్లోనే బ్యాంక్‌ను లూటీ చేసి అక్కడి నుంచి దుండగులు పరార్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల కోసం డైమండ్ సిటీ ప్రాంతాన్ని దిగ్బంధించి అణువణువు గాలిస్తున్నారు. బ్యాంకు, చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని సేకరించి దొంగలను గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
బ్యాంకు సీసీ కెమెరాల్లో ఈ రాబరీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోల్లో దుండగులు తుపాకులతో బ్యాంక్ సిబ్బంది, కస్టమర్లను భయబ్రాంతులకు గురిచేశారు. పట్టపగలు ఎస్బీఐ బ్యాంకులో చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు గాలిస్తున్నారు.