
హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో క్రేన్ కూలిన ఘటనలో మృతులకు రూ.25 లక్షలు నష్టపరిహారం ప్రకటించింది నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది కంపెనీ. సోమవారం ( ఏప్రిల్ 27 ) కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షానికి శంకరపల్లి సమీపంలో ఉన్న మహాలింగాపురంలో ఉన్న ఎన్ సీసీ కంపెనీలో భారీ క్రేన్లు కూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ ఘటన చాలా బాధాకరమని అన్నారు మంత్రి వివేక్. కంపెనీతో మాట్లాడి మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం వచ్చేలా చూస్తామని అన్నారు.
మృతుల కుటుంబాలకు శాశ్వతంగా వేతనం వచ్చేలా కంపెనీతో మాట్లాడతామని… క్షతగాత్రుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు మంత్రి వివేక్.