Reading Time: 2 minutes

Jana Nayagan: పోలింగ్ రోజుల్లో.. విధుల్లో ఉండి.. విజయ్ జననాయగన్ లీక్ వీడియో చూసిన సిబ్బంది అరెస్ట్

Caption of Image.

దళపతి విజయ్ నటించిన జన నాయగన్ పైరసీకి గురవడం ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. థియేటర్లలో విడుదలకు ముందే పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో నిర్మాతలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్రబృందానికి మద్దతుగా నిలవాల్సింది పోయి, విచ్చలవిడిగా లీక్ వెర్షన్‌ను చూసేస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ బాధ్యతలను నిర్వర్తించడానికి వచ్చిన ఓ సీసీటీవీ ఆపరేటర్. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం:

తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధుల్లో భాగంగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీసీటీవీ ఆపరేటర్‌గా నియమించబడిన యువరాజ్ తన బాధ్యతలను నిర్లక్ష్యం చేసినట్టు బయటపడింది.

ఎన్నికల పర్యవేక్షణ వంటి అత్యంత కీలక సమయంలో, అతను కంట్రోల్ రూమ్‌లో తన విధులు నిర్వహించాల్సింది పోయి, “జన నాయగన్” సినిమా లీక్ వెర్షన్‌ను చూసి బయటపడ్డాడు. అంతేకాకుండా, తాను సినిమా చూస్తున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో అవి వేగంగా వైరల్ అయ్యాయి. ఎన్నికల సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా, సెన్సార్ వద్ద పెండింగ్‌లో ఉన్న సినిమా చూసి పట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు యువరాజ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఫేస్‌బుక్ పోస్టులతో బయటపడ్డ నిర్లక్ష్యం..

ముఖ్యంగా అతను ఆ లీక్ అయిన సినిమా కాపీని ఎలా పొందాడన్న అంశంపై పోలీసులు విచారిస్తున్నారు. ఇదే సమయంలో, ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తాను సీసీటీవీ హెడ్‌గా నియమించబడినట్టు యువరాజ్ సోషల్ మీడియాలో వెల్లడించడంతో పాటు తన ఐడీ కార్డు కూడా పంచుకోవడం గమనార్హం. ఈ పోస్టులే తర్వాత వైరల్ అవుతూ ఈ ఘటన వెలుగులోకి రావడానికి కారణమయ్యాయి. ఈ సంఘటన ఎన్నికల సమయంలో బాధ్యతాయుత ప్రవర్తన ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేసింది. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే అవకాశముంది.

రిలీజ్ అప్డేట్:

జన నాయగన్ వచ్చే నెల మే 8న విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. మే 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి వివాదాలు లేకుండా విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సెన్సార్ చిక్కు వీడిందా..

రాజకీయ అంశాల కారణంగా కొన్ని సన్నివేశాలపై CBFC అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చిత్రం నిలిచిపోయింది. సెన్సార్ సమస్యలపై చిత్రబృందం కోర్టును ఆశ్రయించింది. అయినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ క్రమంలోనే కేసును వెనక్కి తీసుకుని రివైజింగ్ కమిటీకి పంపేందుకు అంగీకరించింది. అప్పటి నుంచి సర్టిఫికేషన్‌పై ఎలాంటి అప్డేట్ లేదు. అనంతరం ఫుల్ మూవీ లీక్ అయ్యి.. చిత్రబృందానికి మరో గట్టి దెబ్బ తగిలింది.

ఈ లీక్ ఘటనపై తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతను అనధికారికంగా ఫుటేజ్‌ను యాక్సెస్ చేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసినట్లు గుర్తించారు.

ఈ ఘటన అనంతరం జన నాయగన్ మూవీ ఎడిటర్ ప్రదీప్ రాఘవ్‌పై చర్యలు తీసుకుంటూ ఎడిటర్స్ అసోసియేషన్ అతడిని సస్పెండ్ చేసింది. అతను నేరుగా లీక్‌లో పాలుపంచుకోకపోయినా, నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అతన్ని కొన్నాళ్ళ పాటు సస్పెన్షన్ లో ఉంచినట్లుగా సమాచారం. 

©️ VIL Media Pvt Ltd.