Reading Time: 2 minutes

Viral Video: నైట్ క్లబ్లో నటిపై పోకిరీ దాడి : దవడ పగిలింది.. కన్ను వాచింది..!

Caption of Image.

డేటింగ్ రియాలిటీ షో Splitsvilla సీజన్ 16 కంటెస్టెంట్, నటి ప్రీత్ సింగ్‌ ముంబైలోని ఓ నైట్ క్లబ్‌లో దాడికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని నటి ప్రీత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీడియో షేర్ చేసి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడిలో పన్ను విరగడం, ముఖం వాచిపోవడంతో పాటుగా కళ్లు బాగా కమిలిపోయాయి. ఈ వీడియో చూసిన అభిమానులు షాక్‌కు గురవుతూ, ఆమెకు మద్దతుగా స్పందిస్తున్నారు. 

ప్రీత్ సింగ్‌ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, తనపై జరిగిన ఘటనను వివరించడంతో పాటు తన గాయాలను చూపించారు. ప్రీత్ సింగ్ చెప్పిన ప్రకారం, ఓ స్నేహితురాలితో కలిసి క్లబ్‌లో ఉండగా ఒక యువతి వచ్చి గొడవ ప్రారంభించింది. ఈ సమయంలో ఆ యువతి స్నేహితుల్లో ఒకరు జోక్యం చేసుకుని తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కావడంతో విషయం వైరల్ అవుతోంది.

ఈ సంఘటనపై ప్రీత్ తీవ్ర షాక్‌లో ఉన్నట్లు తెలిపింది. “ముంబై… అమ్మాయిలకు అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటి అని ఎప్పుడో విన్నాను. కానీ నాకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని ఊహించలేదు. ఇప్పటికీ నేను వణికిపోతున్నాను. నా కళ్లకు వాపు వచ్చింది, ముఖంపై గాయాలు అయ్యాయి. ఏమి జరిగిందో ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.” అని వీడియోలో వాపోయింది.

అంతేకాకుండా “ఇలాంటి విషయం నాకు జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది చాలా భయంకరమైన అనుభవం,” అని ప్రీత్ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సహ కంటెస్టెంట్లు, అభిమానులు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. జలక్ గోహిల్, రూత్ ఠాకూర్ వంటి వారు ప్రీత్‌కు మద్దతు తెలుపుతూ, ఇలాంటి సంఘటనలు ఎవరూ ఎదుర్కోకోకూడదు అని పోస్టులు పెడుతున్నారు. 

క్లబ్‌లో ఏమి జరిగింది?

ప్రీత్ సింగ్‌ చెప్పిన ప్రకారం, ఒక చిన్న గొడవ, క్షణాల్లోనే హింసాత్మకంగా మారిందని వీడియోలో చెప్పుకొచ్చింది. “నేను నా స్నేహితురాలితో కలిసి క్లబ్‌లో కూర్చొని సరదాగా గడుపుతున్నాను. అకస్మాత్తుగా ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని లోపలికి ఎలా అనుమతించారని గట్టిగా అరవడం ప్రారంభించింది. మొదట మాటల తగవుగా మొదలైంది. ఆ వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ జోక్యం చేసుకున్న తర్వాతనే గొడవ ముదిరింది. అతను మాపై దాడి చేశాడు. నన్ను చాలా బలంగా కొట్టడంతో నా పంటి విరిగిపోయింది, ముఖం వాచిపోయింది.

చుట్టుపక్కల వాళ్లు జోక్యం చేసుకునే వరకు పరిస్థితి ఆగలేదు. తర్వాత ఆ అమ్మాయి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అని తెలిసింది. ఇంత బహిరంగంగా ఇలా జరగడం చూసి నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. ఎవరూ ఇలాంటి అనుభవం ఎదుర్కోకూడదు,” అని ఆమె తెలిపారు. అయితే, ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు మాత్రం ప్రీత్ సింగ్‌ వెల్లడించలేదు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రీత్ సింగ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

భద్రతపై ఆందోళనలు

ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారులు లేదా సంబంధిత వ్యక్తుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసి, మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఒక సెలబ్రెటీకే ఇలాంటి ఘటనలు జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.