
- పెద్దల సభలో 10 నుంచి మూడుకు పడిపోయిన ఆప్ ఎంపీల సంఖ్య
- 106 నుంచి 113కి పెరిగిన బీజేపీ ఎంపీలు
- 148కి పెరిగిన ఎన్డీయే కూటమి బలం
న్యూఢిల్లీ, వెలుగు: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమవ్వడానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ఆమోదముద్ర వేసినట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్‌వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
రాజ్యసభ వెబ్‌సైట్ ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సంఖ్య 10 నుంచి మూడుకు పడిపోయింది. బీజేపీ ఎంపీల సంఖ్య 106 నుంచి 113కు చేరింది. ఎన్డీయే కూటమి బలం 141 నుంచి 148కి పెరిగింది. ఈ నెల 24న ఆప్ నుంచి రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ సహా ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. విలీనం తరువాత తమను బీజేపీ ఎంపీలుగానే పరిగణించాలని కోరుతూ ఈ ఏడుగురు రాజ్యసభ చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించారు.
ఆప్ ఎంపీలు రాసిన లేఖ రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌కు తగినట్టు ఉందని రాజ్యసభ్య చైర్మన్ భావించి.. ఆ షెడ్యూల్ ప్రకారం 2/3 మెజారిటీతో విలీనాన్ని ఆమోదిస్తున్నట్టు వెల్లడించారు. దీంతో వారంతా బీజేపీ సభ్యులయ్యారు. కాగా, ఆప్ఎంపీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బీజేపీలోకి స్వాగతం పలికారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో దేశ నిర్మాణం కోసం ఎన్డీయేలోకి స్వాగతం. తుక్డే-తుక్డే ఇండియా కూటమికి వీడ్కోలు’ అంటూ ఆప్‌పై విమర్శలు గుప్పించారు.
అలాగే, బీజేపీలో చేరిన సభ్యులపై రిజిజు ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఈ ఏడుగురు ఎంపీలు ఎన్నడూ అనుచిత ప్రవర్తనకు పాల్పడలేదు. ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి, అనుచిత ప్రవర్తనకు పాల్పడలేదు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఒత్తిడి చేసి బీజేపీలో చేర్చుకున్నారు: ఆప్
తమ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆదివారం రాజ్యసభ చైర్మన్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ వినతిపత్రం సమర్పించింది. కేంద్ర సంస్థలను ఉపయోగించి తమ నాయకులను ఒత్తిడి చేసి బీజేపీలోకి చేర్చుకున్నారని ఆరోపించింది. ఈ అంశంపై చట్టపరమైన పోరాటం కూడా కొనసాగుతుందని వెల్లడించింది.
ఆప్ విషపూరితమైంది: రాఘవ్ చద్దా
పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందో వివరిస్తూ రాఘవ్ చద్దా సోమవారం వీడియో విడుదల చేశారు. “నా యవ్వనంలో 15 ఏండ్లు ఈ పార్టీకి ధారపోశాను. కానీ ఇప్పుడు ఆప్ పాత పార్టీలా లేదు. విషపూరితమైంది. ఈ క్రమంలోనే దేశాభివృద్ధి కోసం బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను” అని చద్దా స్పష్టం చేశారు.