Reading Time: < 1 minute

దేశంలో మొదట మహిళలకు ఓటు హక్కు ఇచ్చిందే కాంగ్రెస్: సీఎం రేవంత్

Caption of Image.

హైదరాబాద్: దేశంలో మొదట మహిళలకు ఓటు హక్కు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చిన్నారులు, మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్పందన కార్యక్రమాన్ని సోమవారం (ఏప్రిల్ 27) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పందన పోస్టర్‎ను సీఎం రేవంత్ లాంచ్ చేసి అనంతరం ప్రసంగించారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసింది. యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీ టీమ్స్ చర్యలు తీసుకుంది. అలాగే స్పందన పేరుతో తమ ప్రభుత్వం ఒక కొత్త వ్యవస్థను తెచ్చింది. ఆపదలో ఉన్న చిన్నారులు, మహిళలను ఆదుకోవడమే దీని లక్ష్యమని చెప్పారు. ఫిర్యాదులపై ఆలస్యం లేకుండా వెంటనే చర్యలు ఉంటాయన్నారు. తక్షణమే బాధితులకు మానసిక ధైర్యం కల్పిస్తామని చెప్పారు. మహిళలు, చిన్నారుల రక్షణకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

దేశంలో మొదట మహిళలకు ఓటు హక్కు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళలకు ఓటు హక్కు లేకుండేనన్నారు. కాంగ్రెస్ దేశ అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యులను చేసిందన్నారు. పరిపాలనలో మహిళలను  భాగస్వామ్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 2013లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ తెచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికీ మహిళల పట్ల సమాజంలో కొంత వివక్షత ఉందని.. దానికి ఒక్కరోజులో రూపుమాపలేమన్నారు. 

©️ VIL Media Pvt Ltd.